Mamata Banerjee: శాసనమండలి ఏర్పాటుకు బెంగాల్ శాసనసభ తీర్మానం

  • 1969లో రద్దయిన బెంగాల్ శాసనమండలి 
  • పునరుద్ధరిస్తామంటూ ఎన్నికల ముందు మమత హామీ 
  • మమత కోసమే తీర్మానం చేశారంటున్న విపక్షాలు 
  • మండలి ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన బీజేపీ 
Bengal Assembly passes resolution to establish Legislative Council for Mamata

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 1969లో రద్దయిన శాసనమండలి పునరుద్ధరణకు తాజాగా ఆ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది. శాసనసభకు హాజరైన 265 మంది ఎమ్మెల్యేలలో 196 మంది ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. దీనిని పూర్తిగా వ్యతిరేకించిన బీజేపీ సభ్యుల అభ్యంతరాల మధ్యే ఈ తీర్మానం ఆమోదం పొందింది. తాము అధికారంలోకి వచ్చాక శాసన మండలిని పునరుద్ధరిస్తామని మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో మమతా బెనర్జీ హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా ఈ తీర్మానాన్ని ఆమోదించారు.

అయితే, మమత కోసమే హడావిడిగా శాసన మండలిని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఆసక్తి చూపుతోందంటూ ప్రతిపక్షాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేత సువేందు అధికారి చేతిలో మమతా బెనర్జీ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమె సీఎంగా బాధ్యతలను స్వీకరించారు. నిబంధనల ప్రకారం ఆరు నెలల్లోగా ఆమె చట్టసభకు ఎన్నిక కావాల్సి ఉంది. అంటే అక్టోబరులోగా శాసనసభకు ఆమె ఎన్నిక కావాల్సి ఉంది.

అయితే కరోనా నేపథ్యంలో ఏదైనా శాసనసభ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరగకపోతే ఆమె సీఎం పదవికి గండం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో శాసనమండలిని ఏర్పాటు చేయడానికి బెంగాల్ శాసనసభ తీర్మానం చేసిందని విమర్శిస్తున్నారు. శాసనమండలి ఏర్పాటయితే మమత ఎమ్మెల్సీగా ఎన్నికై సీఎం పదవిలో కొనసాగవచ్చు.

మరోవైపు శాసనసభ తీర్మానాన్ని కేంద్ర హోంశాఖకు పంపిస్తారు. ఈ తీర్మానంపై కేంద్ర హోంశాఖ సానుకూలంగా స్పందించాల్సి ఉంది. అయితే, ప్రస్తుత పరిస్థితులలో కేంద్రం ఈ తీర్మానాన్ని అంత తేలికగా ఆమోదించి శాసనమండలిని పునరుద్ధరిస్తుందని భావించలేం. 

More Telugu News