Revanth Reddy: పెద్ద‌మ్మ‌త‌ల్లికి పూజ‌లు చేసిన రేవంత్ రెడ్డి.. గాంధీభవన్‌కు భారీగా త‌ర‌లివ‌స్తోన్న నేత‌లు, కార్య‌క‌ర్త‌లు

  • కాసేప‌ట్లో రేవంత్ ప్ర‌మాణ స్వీకారం
  • కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల్లో నూత‌నోత్సాహం
  • పూజ‌ల్లో పాల్గొంటోన్న కాంగ్రెస్ నేత‌లు
  • గాంధీ భ‌వ‌న్ లో పెద్ద ఎత్తున ప్ర‌మాణ స్వీకారోత్స‌వ కార్య‌క్ర‌మం
revanth reddy visit peddamma temple

హైద‌రాబాద్‌లోని కాంగ్రెస్ రాష్ట్ర కార్యాల‌యం  గాంధీభవన్‌కు కొత్త క‌ళ వ‌చ్చింది.. కాంగ్రెస్ తెలంగాణ కార్య‌క‌ర్త‌ల్లో నూత‌నోత్సాహం నిండుకుంటోంది. గాంధీభ‌వన్‌కు ఇప్ప‌టికే రంగులు అద్ది, పూల మొక్క‌లు నాటి సుంద‌రంగా తీర్చిదిద్దారు. ఇదంతా టీపీసీసీ అధ్య‌క్షుడిగా రేవంత్ రెడ్డి కాసేప‌ట్లో  బాధ్యతలు స్వీక‌రించ‌నున్న నేప‌థ్యంలో జ‌రిగింది. కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంతో సంబ‌రాలు చేసుకుంటున్నారు.

టీపీసీసీ అధ్య‌క్షుడిగా తాను బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్న నేప‌థ్యంలో ఈ రోజు ఉదయం జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడిలో రేవంత్ పూజలు చేసి, అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి నాంపల్లిలోని యూసుఫైన్ దర్గా చేరుకున్నారు. అక్కడ చాదర్ సమర్పించి ప్రార్థనలు చేస్తున్నారు. ఆయ‌న వెంట భారీగా నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ఉన్నారు.

కాసేప‌ట్లో అక్కడి నుంచి ప్రదర్శనగా గాంధీభవన్‌కు చేరుకుని, పీసీసీ అధ్యక్షుడిగా ఉత్త‌మ్ కుమార్ రెడ్డి నుంచి బాధ్యతలు తీసుకుంటారు. అదే స‌మ‌యంలో పీసీసీ కొత్త కార్యనిర్వాహక అధ్యక్షులు, ఇతర కమిటీ సభ్యులూ బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ సంద‌ర్భంగా ఆయా నేత‌లు కూడా ప‌లు ఆల‌యాల్లో పూజ‌లు చేస్తున్నారు.

పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమితులైన అంజన్ కుమార్ యాదవ్ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో పూజలు చేయ‌నున్నారు. అనంత‌రం అసెంబ్లీలోని బంగారు మైసమ్మను దర్శించుకోనున్నారు. ప‌లు ప్రాంతాల నుంచి వస్తున్న కాంగ్రెస్ నేత‌లు అంద‌రూ కాసేప‌ట్లో గాంధీభవన్ చేరుకుంటారు.

ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ నేత‌లు భారీ జనసమీకరణకు పిలుపునిచ్చారు. గాంధీభ‌వ‌న్‌లో నిర్వ‌హించ‌నున్న బ‌హిరంగ స‌భ‌లో రేవంత్ రెడ్డితో పాటు ప‌లువురు నేత‌లు ప్ర‌సంగించ‌నున్నారు. ప‌లు ప్రాంతాల నుంచి గాంధీ భ‌వ‌న్‌కు వ‌చ్చే నేత‌ల‌కు సంబంధించిన ప్లెక్సీలను పెద్ద ఎత్తున‌ ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి దక్షిణాది రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు హాజరయ్యే అవకాశం ఉంది.

More Telugu News