Kodandaram: తెలంగాణలో మరో రైతాంగ ఉద్యమం అవసరం ఉంది: కోదండరామ్

TJS Chief Kodandaram says Peasant movement need in Telangana
  • ‘రైతాంగ ఉద్యమం తాజా పరిణామాలు-భవిష్యత్తు’ అంశంపై వెబినార్
  • రైతుల రక్షణ కోసం కొత్త ఉద్యమానికి అందరూ ఏకం కావాలని పిలుపు
  • అరెస్టులను తట్టుకుని 9 నెలలుగా పోరాడుతున్నామన్న యోగేంద్ర యాదవ్
  • ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నేడు నిరసన దీక్ష చేస్తామన్న కన్నెగంటి రవికుమార్
తెలంగాణలో మరో సంఘటిత రైతాంగ ఉద్యమం అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ అన్నారు. ‘రైతాంగ ఉద్యమం తాజా పరిణామాలు-భవిష్యత్తు’ అంశంపై నిన్న రైతు స్వరాజ్య వేదిక జూమ్‌లో నిర్వహించిన వెబ్‌నార్‌లో  మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. దోపిడీ నుంచి రైతులకు రక్షణ కోసం కొత్త ఉద్యమానికి అందరూ ఏకం కావాలని ఢిల్లీలో జరుగుతున్న రైతుల పోరాటం చెబుతోందని కోదండరామ్ పేర్కొన్నారు.

రైతుల పోరాట సంయుక్త కమిటీ ప్రతినిధి యోగేంద్ర యాదవ్ మాట్లాడుతూ గత 9 నెలలుగా రైతులు అరెస్టులను తట్టుకుని పోరాడుతున్నారని అన్నారు. అఖిల భారత కిసాన్ సంఘాల సమన్వయ కమిటీ ప్రతినిధి కవిత కురుగంటి మాట్లాడుతూ.. గత నవంబరులో రైతుల పోరాటం మొదలైనప్పుడు ఉన్న రైతుల కంటే ఇప్పుడు ఎక్కువమంది రైతులు పోరాడుతున్నారని చెప్పారు.

నేటి సాయంత్రం హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పైనున్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపడుతున్నట్టు తెలంగాణ రైతు జేఏసీ నేత కన్నెగంటి రవికుమార్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కేవలం రైతు బంధు మాత్రమే ఇస్తూ పంటల బీమా, నష్ట పరిహారం గురించి మాట్లాడడం లేదని రైతు స్వరాజ్య వేదిక నాయకుడు విస్సా కిరణ్ కుమార్ విమర్శించారు.
Kodandaram
TJS
Farmers
Peasant movement
Telangana

More Telugu News