Telangana: సౌదీలో పాక్ తరపున గూఢచర్యం.. హైదరాబాద్ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసుల అదుపులో బోధన్ యువకుడు!

  • గూఢచర్యం కేసులో ఏడాదిన్నరపాటు సౌదీలో జైలు శిక్ష
  • విడుదలైన అనంతరం అక్రమంగా భారత్‌కు
  • భారత రాయబార కార్యాలయం ద్వారా యువకుడి గుర్తింపు
  • తమకు సమాచారం లేదన్న నిజామాబాద్ పోలీసు కమిషనర్
Hyderabad counter intelligence police arrested bodhan person

నిజామాబాద్ జిల్లా బోధన్‌కు చెందిన 35 ఏళ్ల వ్యక్తిని హైదరాబాద్ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది. యువకుడిని అదుపులోకి తీసుకున్న విషయాన్ని పోలీసులు ఇప్పటి వరకు ధ్రువీకరించనప్పటికీ, స్థానికులు మాత్రం అతడిని నిన్న పోలీసులు తీసుకెళ్లినట్టు చెబుతున్నారు. గతంలో సౌదీ అరేబియా వెళ్లిన యువకుడు అక్కడ పాకిస్థాన్ యువకుడితో కలిసి ఆ దేశం తరపున గూఢచర్యం చేస్తూ పట్టుబడ్డాడు. దీంతో ఇద్దరూ ఏడాదిన్నరపాటు జైలు శిక్ష అనుభవించినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత జైలు నుంచి విడుదలైన యువకుడు భారత్‌కు అక్రమంగా తిరిగి వచ్చినట్టు గుర్తించారు.

సౌదీకి వలస వచ్చిన కార్మికులకు అక్కడి ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించగా వారితో కలిసి అక్రమంగా భారత్ చేరుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. అతడు కనిపించకపోవడంతో భారత రాయబార కార్యాలయం ద్వారా అతడి ఆచూకీని గుర్తించి ఇంటెలిజెన్స్ బ్యూరోకు సమాచారం ఇచ్చారు. వారు తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారొచ్చి అతడిని అదుపులోకి తీసుకున్నారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నట్టు తమకైతే ఎలాంటి సమాచారం లేదని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ స్పష్టం చేశారు.

More Telugu News