Chandrababu: మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతిని ప్రభుత్వం పట్టించుకోవడంలేదంటూ చంద్రబాబు, లోకేశ్ ఆవేదన

  • నేడు మంగళంపల్లి జయంతి
  • గతంలో ప్రభుత్వ కార్యక్రమంలా జరిపామన్న చంద్రబాబు
  • ఇప్పటి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని వ్యాఖ్యలు
  • మహనీయుల్ని గౌరవించుకోవాలన్న లోకేశ్
Chandrababu and Lokesh questions AP Govt over Mangalampalli Balamurali Krishna birth anniversary

కర్ణాటక సంగీత దిగ్గజం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతిని ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. సంగీత కళానిధి డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ తెలుగువారందరికీ గర్వకారణమైన కళాకారుడని చంద్రబాబు కొనియాడారు. ఆ గాయక శిఖామణి గౌరవార్థం ఆయన జయంతిని ప్రతి సంవత్సరం రాష్ట్ర వేడుకగా జరపాలని గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రకటించి అమలు చేశామని అన్నారు.

గుంటూరులోని ప్రభుత్వ సంగీత మరియు నాట్య కళాశాలకు బాలమురళీకృష్ణ పేరు పెట్టామని తెలిపారు. ప్రతి ఏటా ఆయన జయంతి నాడు నిష్ణాతులైన సంగీత కళాకారులకు లక్ష రూపాయల అవార్డును ఇవ్వాలని, సంగీతం నేర్చుకునే ప్రతిభగల విద్యార్థులకు స్కాలర్ షిప్ లు ఇవ్వాలని ఉత్తర్వులు ఇచ్చామని చంద్రబాబు వివరించారు. బాలమురళీకృష్ణ రచించిన 300 సంకీర్తనలను రికార్డు చేయించాలని ప్రణాళికలు రూపొందించామని తెలిపారు.

కానీ ఈ ప్రభుత్వంలో ఆయన జయంతి సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు జరగకపోవడం బాధగా ఉందని పేర్కొన్నారు. నేడు బాలమురళీకృష్ణ జయంతి సందర్భంగా వారి కళాసేవను స్మరించుకుంటూ ఆ కళాభూషణుడికి నివాళులు అర్పిస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు.

నారా లోకేశ్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర వేడుకగా జరగాల్సిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతి ఉత్సవాన్ని ప్రస్తుత సర్కారు కనీసం పట్టించుకోకపోవడం మనోవేదనకు గురిచేస్తోందని తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో శ్రీమాన్ మంగళంపల్లి వారి జయంతిని ప్రభుత్వ కార్యక్రమంగా నిర్ణయించడమే కాకుండా, గుంటూరు సంగీత కళాశాలకు వారి పేరు పెట్టి, అనేక సాంస్కృతిక కార్యక్రమాలను వారి పేరుమీదనే నిర్వహించడం జరిగిందని లోకేశ్ వివరించారు. కానీ, నేటి ప్రభుత్వం దాన్ని పట్టించుకోకపోవడం చూస్తుంటే మనల్ని మనమే అవమానించుకున్నట్టు భావించాలని పేర్కొన్నారు.

"జగన్ రెడ్డి గారూ... మన మహనీయులను మనమే గౌరవించుకోవాలి అనేది కాస్త తెలుసుకోండి. మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతి ఉత్సవాన్ని ప్రభుత్వమే నిర్వహించే విధంగా చర్యలు తీసుకోండి" అని లోకేశ్ హితవు పలికారు.

More Telugu News