Karnataka: కలిసే పుట్టారు.. కలిసే తనువు చాలించారు!

Fear Separation Twins End Life
  • మాండ్యలో కవలల విషాదాంతం
  • వేర్వేరు సంబంధాలు చూసిన తల్లిదండ్రులు
  • విడిపోతామన్న భయంతో తీవ్ర నిర్ణయం
ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లు కవలలు. చిన్నప్పటి నుంచీ ఒకరంటే ఒకరికి అమితమైన ప్రేమ. ఏం చేసినా కలిసే చేసేవారు. ఒకరు లేకుండా మరొకరు ఉండలేకపోయేవారు. కానీ, పెళ్లి అనే ఒక భయం వారిని వెంటాడింది. తల్లిదండ్రులు వేర్వేరు సంబంధాలు చూడడంతో.. ఆ పెళ్లి తమను దూరం చేస్తుందనే భయం వారి మనసుల్లో గూడు కట్టుకుంది. దీంతో కలిసే పుట్టిన ఆ ఇద్దరు.. కలిసే తనువు చాలించారు.

ఈ విషాద ఘటన కర్ణాటకలోని మాండ్యా జిల్లా హనసనహళ్లి గ్రామంలో చోటుచేసుకుంది. మరణించిన ఆ అక్కాచెల్లెళ్ల పేర్లు దీపిక, దివ్య (19). సురేశ్, యశోద దంపతులకు కలిగిన సంతానం. చిన్నప్పటి నుంచి వారిద్దరూ ఒకే రకమైన దుస్తులు వేసుకునేవారు. ఒకే స్కూల్, కాలేజీలో చదివారు. ఎప్పుడూ ఇద్దరూ విడిచి వున్నది లేదు. జీవితాంతం అలాగే ఉండాలనుకున్నారు.

కానీ, తల్లిదండ్రులు వేర్వేరు ప్రాంతాలకు చెందిన వారితో పెళ్లి చేసేందుకు నిశ్చయించారు. పెళ్లితో ఎడబాటు తప్పదని గ్రహించిన అక్కాచెల్లెళ్లు.. శనివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఉసురు తీసుకున్నారు. సోమవారం ఉదయం ఆత్మహత్యల ఉదంతం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Karnataka
Twins
Crime News

More Telugu News