ఆమిర్ ఖాన్ దంపతుల విడాకులపై కంగనా రనౌత్ స్పందన

06-07-2021 Tue 12:38
  • విడాకులు తీసుకుంటున్న ఆమిర్ ఖాన్, కిరణ్ రావు
  • వారి పిల్లలు ముస్లింలగానే ఎందుకు ఉండాలన్న కంగన
  • అన్ని మతస్తుల మాదిరి ముస్లింలు ఎందుకు ఉండటం లేదని ప్రశ్న
Kangana Ranaut response on Aamir Khan divorece with his wife

దాదాపు 15 సంవత్సరాల పాటు ఎంతో అన్యోన్యంగా జీవించిన బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్, కిరణ్ రావుల జంట విడిపోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరి ప్రకటనతో సినీ అభిమానులు షాక్ కు గురయ్యారు. విడాకులు తీసుకున్న తర్వాత కూడా తాము కుటుంబసభ్యుల మాదిరే ఉంటామని వారు వెల్లడించారు. వీరు విడిపోతున్న నేపథ్యంలో నెటిజెన్లు తలా ఒక తరహాలో కామెంట్లు చేస్తున్నారు. ఈ అంశంపై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కూడా స్పందించింది.

పంజాబ్ లో ఒకనొక సమయంలో చాలా కుటుంబాలు ఒక కొడుకుని హిందువులా, మరొక కొడుకును సిక్కులా పెంచేవని కంగన తెలిపింది. ఇప్పుడు అమీర్ ఖాన్ రెండోసారి విడాకులు తీసుకుంటున్న తరుణంలో వారి పిల్లలు ఎందుకు ముస్లింలుగానే గుర్తింపబడతారని ఆమె ప్రశ్నించింది. మారుతున్న కాలంతో పాటే దీన్ని మనం మార్చాలని చెప్పింది. ఒకే కుటుంబంలో హిందూ, జైన, బౌద్ధ, సిక్కు, రాధస్వామి, నాస్తికులు జీవించినట్టు... ముస్లింలు ఎందుకు నివసించడం లేదని ప్రశ్నించింది. ముస్లింలను పెళ్లి చేసుకోవాలనుకునేవాళ్లు మతాన్ని ఎందుకు మార్చుకోవాలని అడిగింది.