కరోనా బారినపడిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు 20 రోజుల ప్రత్యేక సెలవులు

06-07-2021 Tue 09:16
  • ఐదు కేటగిరీలుగా విభజించి సెలవుల మంజూరు
  • కంటైన్‌మెంట్ జోన్ పరిధిలో ఉండి కరోనా బారినపడితే అది ఎత్తేసే వరకు వర్క్‌ ఫ్రమ్ హోంగా పరిగణింపు
  • మార్చి 25 నుంచే ఉత్తర్వులు అమల్లోకి వస్తాయన్న ప్రభుత్వం
 20 days special leave for corona affected AP government employees
కరోనా బారినపడిన ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం ఊరటనిచ్చే ఉత్తర్వులు జారీ చేసింది. వైరస్ బారినపడిన ఉద్యోగులకు 20 రోజుల వరకు ప్రత్యేక సాధారణ సెలవులు మంజూరు చేసింది. ఈ సెలవులను ఐదు కేటగిరీలుగా విభజించింది. కరోనా బారినపడిన ఉద్యోగి హోం ఐసోలేషన్‌లో ఉంటే 20 రోజుల వరకు కమ్యూటెడ్ సెలవులు మంజూరు చేస్తారు. ఒకవేళ అవి అందుబాటులో లేకుంటే 15 రోజులపాటు ప్రత్యేక సాధారణ సెలవులు ఇస్తారు. మిగతా ఐదు రోజులను ఈఎల్, హెచ్‌పీఎల్‌ నుంచి భర్తీ చేస్తారు.

ఉద్యోగి ఒకవేళ ఆసుపత్రిలో చేరితే పాజిటివ్‌గా తేలినప్పటి నుంచి 20 రోజులపాటు సెలవులు ఇస్తారు. ఉద్యోగిపై ఆధారపడిన కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా వైరస్ సంక్రమిస్తే 15 రోజుల ప్రత్యేక సాధారణ సెలవులు మంజూరు చేస్తారు. కరోనా సోకిన వ్యక్తికి కాంటాక్ట్ అయిన ఉద్యోగి హోం క్వారంటైన్‌లో ఉంటే ఏడు రోజులపాటు వర్క్ ఫ్రమ్ హోంగా పరిగణిస్తారు. కంటైన్‌మెంట్ జోన్‌ పరిధిలోని వ్యక్తి కరోనా బారినపడి క్వారంటైన్‌లో ఉంటే కంటైన్‌మెంట్ జోన్‌ను ఎత్తివేసే వరకు సదరు ఉద్యోగి వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నట్టు లెక్కిస్తారు. ఈ ఏడాది మార్చి 25 నుంచే ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని ప్రభుత్వం తెలిపింది.