Vijay Konathala: చైనాలో డ్యాన్స్ మాస్టర్ గా రాణిస్తున్న తెలుగు కుర్రాడు

  • అనకాపల్లిలో పుట్టి పెరిగిన కొణతాల విజయ్
  • బాల్యం నుంచి డ్యాన్స్ పై క్రేజ్ 
  • సొంత గ్రూప్ తో ప్రదర్శనలు
  • జెమినీ, జీ టీవీ కార్యక్రమాలతో గుర్తింపు
  • అంతర్జాతీయ స్థాయికి చేరిన విజయ్ ప్రతిభ
Vijay Konathala earns name in China as choreographer

అనకాపల్లికి చెందిన కొణతాల విజయ్ పేరు చైనాలో బాగా వినిపిస్తోంది. ఎందుకంటే విజయ్ ఇప్పుడక్కడ స్టార్ డ్యాన్స్ మాస్టర్. అనకాపల్లిలో పుట్టి పెరిగిన విజయ్ కు బాల్యం నుంచే డ్యాన్స్ అంటే మక్కువ. దాంతో స్కూల్ స్థాయి నుంచే ఓ డ్యాన్స్ గ్రూప్ ను నిర్వహించాడు. చిన్నతనంలోనే తండ్రి, సోదరుడ్ని కోల్పోయిన విజయ్ కు ఓ దశలో తల్లి, మరో సోదరుడ్ని చూసుకోవాల్సిన బాధ్యత మీద పడింది. దాంతో తన డ్యాన్స్ గ్రూప్ తో విరివిగా ప్రదర్శనలు ఇస్తూ కుటుంబ పోషణ కొనసాగించాడు.

అయితే, విజయ్ లోని డ్యాన్స్ నైపుణ్యం అతడిని టీవీ షోల దిశగా నడిపించింది. తన టాలెంటుతో మెగాస్టార్ చిరంజీవి, లారెన్స్ మాస్టర్ వంటి సినీ ప్రముఖుల దృష్టిలో పడ్డాడు. జీ టీవీలో ప్రసారమైన డేర్ టు డ్యాన్స్ కార్యక్రమానికి యాంకర్ గానూ వ్యవహరించి మెప్పించాడు. అక్కడ్నించి విజయ్ అంతర్జాతీయస్థాయికి ఎదిగాడు. థాయ్ లాండ్ లోనూ కొరియోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్నాడు. అక్కడ్నించి విజయ్ ప్రస్థానం చైనా దిశగా సాగింది.

కొందరు సన్నిహితుల ఆహ్వానం మేరకు చైనా వెళ్లిన ఈ అనకాపల్లి కుర్రాడు ఇక వెనుదిరిగి చూసుకోలేదు. కొద్దికాలంలోనే చైనా టీవీ చానళ్లలో కొరియోగ్రాఫర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. విజయ్ డ్యాన్స్ లోనే కాదు యోగాలోనూ దిట్ట. అటు డ్యాన్స్, ఇటు యోగాతో చైనీయులను అలరిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

More Telugu News