Talasani: బోనాలను ఘనంగా నిర్వహించాలని కేసీఆర్ ఆదేశించారు: తలసాని

KCR ordered to celebrate Golkada Bonali in a grand way says Talasani
  • కరోనా వల్ల గత ఏడాది బోనాల ఉత్సవాలను నిరాడంబరంగా నిర్వహించాం
  • ప్రజలను చల్లగా చూడాలని అమ్మవారిని కోరుతున్నా
  • అమ్మవారి దర్శనం కోసం లక్షలాది మంది తరలి వస్తారు

ఈ నెల 11 నుంచి గోల్కొండ బోనాల ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్సవ ఏర్పాట్లు, నిర్వహణపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈరోజు ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశమై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ, కరోనా వల్ల గత సంవత్సరం బోనాలను నిరాడంబరంగా నిర్వహించామని... అందువల్ల ఈ ఏడాది ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని చెప్పారు.

కరోనా మహమ్మారిని పారద్రోలి ప్రజలను చల్లగా చూడాలని గోల్కొండ జగదాంబ అమ్మవారిని కోరుతున్నానని తలసాని చెప్పారు. అమ్మవారి దర్శనం కోసం లక్షలాది భక్తులు తరలి వస్తారని... ఎవరికీ ఇబ్బంది కలగకుండా, అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. ఉత్సవాల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు రూ. 10 లక్షలు మంజూరు చేస్తున్నామని చెప్పారు. వివిధ ఉత్సవాలను నిర్వహించేందుకు వివిధ ఆలయాలకు ప్రభుత్వం రూ. 15 కోట్లను ఇస్తుందని తెలిపారు. ప్రైవేటు ఆలయాలకు కూడా ఆర్థిక సాయాన్ని అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని అన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News