Chilakam Ramachandra Reddy: బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు చిలకం రామచంద్రారెడ్డి కన్నుమూత

AP BJP former president Chilakam Ramachandra Reddy dies of illness
  • ఉమ్మడి ఏపీకి బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన చిలకం
  • కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వైనం
  • చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స
  • ఈ సాయంత్రం మృతి
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు చిలకం రామచంద్రారెడ్డి కన్నుమూశారు. ఆయన వయసు 85 సంవత్సరాలు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు తుదిశ్వాస విడిచారు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు.

చిలకం రామచంద్రారెడ్డి రాయలసీమకు తాగు, సాగునీటి కోసం గతంలో పాదయాత్ర చేపట్టారు. దుర్భిక్ష ప్రాంతం రాయలసీమకు ప్రాజెక్టుల అవసరం ఎంతుందో నాడే ఆయన ఎత్తిచూపారు. ఫ్యాక్షన్ కక్షల ఆలవాలమైన రాయలసీమలో తుపాకుల లైసెన్సులు రద్దు చేయాలంటూ ఉద్యమం చేపట్టిన చరిత్ర చిలకం రామచంద్రారెడ్డి సొంతం. అప్పట్లో రెడ్డి సామాజిక వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినా, సొంత సామాజిక వర్గం కంటే సామాన్యులే ముఖ్యమని ఉద్యమం కొనసాగించారు. ఫ్యాక్షన్ అంతానికి తన శక్తిమేర కృషి చేశారు.

రామచంద్రారెడ్డి మృతి పట్ల భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం తెలియజేశారు. రామచంద్రారెడ్డి సిద్ధాంతాలకు కట్టుబడిన నాయకుడు అని కొనియాడారు. రామచంద్రారెడ్డి తన పట్ల ఎంతో ఆప్యాయత చూపేవారని గుర్తుచేసుకున్నారు. ఆయనతో కలిసి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నానని వెంకయ్యనాయుడు వెల్లడించారు. ఈ విషాద సమయంలో రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతున్నట్టు పేర్కొన్నారు.

అటు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి, ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు, రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్చార్జి సునీల్ దేవధర్, ఎంపీ జీవీఎల్ నరసింహారావు తదితరులు తమ సంతాపం తెలియజేశారు.
Chilakam Ramachandra Reddy
AP BJP
Former President
Venkaiah Naidu
Andhra Pradesh

More Telugu News