దేశవాళీ క్రికెట్ పోటీల నిర్వహణకు సిద్ధమైన బీసీసీఐ

03-07-2021 Sat 18:51
  • కరోనా కారణంగా గత సీజన్ రద్దు
  • మెరుగవుతున్న పరిస్థితులు
  • సెప్టెంబరు 21 నుంచి దేశవాళీ టోర్నీలు
  • 2021-22 సీజన్ కు షెడ్యూల్ ప్రకటన
BCCI released domestic cricket season schedule
కరోనా వ్యాప్తి కారణంగా ఏడాదికి పైగా భారత్ లో దేశవాళీ క్రికెట్ నిలిచిపోయింది. పరిస్థితులు క్రమంగా కుదుటపడుతున్న నేపథ్యంలో, రంజీ ట్రోఫీ సహా ఇతర దేశవాళీ టోర్నీల ప్రారంభానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సన్నద్ధమవుతోంది. సెప్టెంబరు 21 నుంచి దేశవాళీ టోర్నీల ప్రారంభానికి బోర్డు ప్రణాళిక రూపొందించింది. కొవిడ్ మహమ్మారి కారణంగా గత సీజన్ లో అన్ని టోర్నీలు రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ 2021-22 సీజన్ కు దేశవాళీ టోర్నీల షెడ్యూల్ ను విడుదల చేసింది.

ఈ సీజన్ లో పురుషుల, మహిళల క్రికెట్లో అన్ని వయో విభాగాల్లో మొత్తం 2,127 మ్యాచ్ లు నిర్వహించనున్నట్టు బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆటగాళ్లు, ఇతర సిబ్బంది, ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని దేశవాళీ క్రికెట్ కు ప్రణాళిక రూపొందించినట్టు తెలిపింది.

దేశవాళీ టోర్నీల షెడ్యూల్ ఇదే...

  • సెప్టెంబరు 21 నుంచి సీనియర్ ఉమెన్స్ వన్డే లీగ్
  • అక్టోబరు 27 నుంచి సీనియర్ ఉమెన్స్ వన్డే చాలెంజర్ ట్రోఫీ
  • అక్టోబరు 20 నుంచి నవంబరు 12 వరకు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ
  • నవంబరు 16 నుంచి 2022 ఫిబ్రవరి 19 వరకు రంజీ ట్రోఫీ
  • 2022 ఫిబ్రవరి 23 నుంచి మార్చి 26 వరకు విజయ్ హజారే ట్రోఫీ