COVID19: కోల్​ కతా నకిలీ టీకా క్యాంపు​ కేసు.. సీరమ్​ కు కోల్​కతా పోలీసుల నోటీసులు

Kolkata Police Sent Notices To Serum Institute Of India
  • ఎంపీ మిమి చక్రవర్తి వాంగ్మూలం నమోదు
  • మరో ఇద్దరి వాంగ్మూలం కూడా
  • కలకత్తా హైకోర్టులో అఫిడవిట్
పశ్చిమబెంగాల్ రాజధాని కోల్ కతాలో నకిలీ టీకా కార్యక్రమానికి సంబంధించి సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు కోల్ కతా పోలీసులు నోటీసులు ఇచ్చారు. కలకత్తా హైకోర్టు సమర్పించిన అఫిడవిట్ లో పోలీసులు ఈ విషయాన్ని వెల్లడించారు. కేసులో నటి, ఎంపీ మిమి చక్రవర్తి వాంగ్మూలాన్ని నమోదు చేసినట్టు చెప్పారు. ఆమెతో పాటు మరో ఎంపీ శాంతనూ సేన్, నటి లవ్లీ మోయిత్రాల వాంగ్మూలాలను కూడా తీసుకున్నామన్నారు.

సెక్షన్ 161 ప్రకారం వారిని సాక్షులుగా పరిగణించి విచారించామనీ చెప్పారు. కేసు దర్యాప్తు సందర్భంగా సీరమ్ జనరల్ మేనేజర్ కు నోటీసులు పంపించామని చెప్పారు. కొవిషీల్డ్ వ్యాక్సిన్ ను సంస్థే తయారు చేస్తున్నందున నోటీసులివ్వాల్సి వచ్చిందని, సంస్థ స్పందన కోసం వేచి చూస్తున్నామని అందులో పేర్కొన్నారు.

పది రోజుల క్రితం ఐఏఎస్ ముసుగులో దేవాంజన్ దేవ్ అనే వ్యక్తి కోల్ కతా మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులోనే వ్యాక్సినేషన్ క్యాంపును పెట్టాడు. అందరికీ కొవిషీల్డ్ వేస్తున్నట్టు ప్రకటించాడు. ఆ కార్యక్రమానికి మిమి చక్రవర్తిని ముఖ్య అతిథిగా ఆహ్వానించాడు. ఆమెతో పాటు ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి వ్యాక్సిన్ తీసుకున్నారు.  

అయితే, కొన్ని రోజుల తర్వాత అక్కడ దుమ్ముతో నిండిపోయిన కొన్ని వ్యాక్సిన్ సీసాలు, కొవిషీల్డ్ వ్యాక్సిన్ అని ప్రచారం జరిగిన ద్రావణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జరిగింది ఫేక్ వ్యాక్సినేషన్ క్యాంప్ అని తేల్చారు. వ్యాక్సిన్ అని చెప్పి యాంటీ బయాటిక్ మందులిచ్చినట్టు పేర్కొన్నారు. కోల్ కతాలోని మరికొన్ని చోట్ల కూడా ఇలాంటి ఫేక్ వ్యాక్సినేషన్ క్యాంపులను నిర్వహించిన అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
COVID19
Kolkata
Covishield
Serum Institute Of India

More Telugu News