Rafale: ‘రాఫెల్’​ డీల్​ విచారణకు జడ్జిని నియమించిన ఫ్రాన్స్​

  • అవినీతి, బంధుప్రీతిపై విచారణ
  • మాజీ అధ్యక్షుడు హోలాండ్ చర్యలపై దర్యాప్తు
  • జూన్ 14న అధికారికంగా దర్యాప్తు మొదలు
France Appoints Independent Judge To Probe Rafale Deal

రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో అవకతవకలకు సంబంధించి ఫ్రాన్స్ ప్రభుత్వం దర్యాప్తును మరింత ముమ్మరం చేసింది. రూ.59 వేల కోట్ల విలువైన డీల్ పై న్యాయ విచారణ జరిపేందుకు ప్రభుత్వం ఓ జడ్జిని నియమించినట్టు ఫ్రాన్స్ ప్రభుత్వ న్యాయ సేవల (పీఎన్ఎఫ్)కు చెందిన ఆర్థిక నేర విచారణ విభాగం ప్రకటించింది. భారత్ తో 2016లో చేసుకున్న 36 రాఫెల్ కొనుగోళ్ల ఒప్పందంలో అవినీతి, బంధుప్రీతి వంటి వాటిపై విచారణ జరుగుతుందని స్పష్టం చేసింది. కేసు దర్యాప్తు జూన్ 14న అధికారికంగా ప్రారంభమైందని తెలిపింది.

విచారణలో భాగంగా ఒప్పందం కుదిరే నాటికి దేశాధ్యక్షుడిగా ఉన్న ఫ్రాన్సిస్ హోలాండ్ తీసుకున్న చర్యలపై సమగ్ర దర్యాప్తును చేస్తారని తెలిపింది. ఒప్పందంలో ఎన్నో అవకతవకలు జరిగాయంటూ మీడియాపార్ట్ అనే వార్తా సంస్థ కథనాలు ప్రచురించడం, షెర్పా అనే స్వచ్ఛంద సంస్థ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ప్రభుత్వం దర్యాప్తు చేస్తోంది.  

కేసుపై ఆ విమానాలను అభివృద్ధి చేసిన దసో ఏవియేషన్ ఇంతవరకు స్పందించలేదు. కాగా, రాఫెల్ డీల్ లో అవినీతికి సంబంధించి పక్కా సాక్ష్యాలున్నా ఆ కేసును పీఎన్ఎఫ్ మాజీ చీఫ్ ఇలియాన్ హౌలటి పక్కకు పడేశారని మీడియా పార్ట్ వరుస కథనాలు ప్రచురించింది. ఇతర అధికారుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైనా పట్టించుకోలేదని ఆరోపించింది.

రాఫెల్ డీల్ పై ఇప్పటికే కాంగ్రెస్ ఎన్నో ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. పార్లమెంట్ సమావేశాలు జరిగినప్పుడల్లా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆ విషయం మీదే మాట్లాడారు. ఏ మాత్రం అనుభవం లేని రిలయన్స్ డిఫెన్స్ ను ఒప్పందంలో ఎలా భాగం చేస్తారని ప్రశ్నించారు. అంతేగాకుండా కాంగ్రెస్ హయాంలో జరిగిన చర్చల్లో కుదిరిన ధర కన్నా ఎక్కువ ధరకు యుద్ధ విమానాలను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. అయితే, ఈ డీల్ పై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని 2019లో సుప్రీంకోర్టు కొట్టివేసింది. డీల్ లో ఎలాంటి అవకతవకలూ తమకు కనిపించట్లేదని పేర్కొంది.

More Telugu News