Telangana: తెలంగాణలో నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మాదిరి వర్షాలు

  • తెలంగాణపై ఉపరితల ద్రోణి
  • మొన్న ఉదయం నుంచి నిన్న రాత్రి వరకు పలు ప్రాంతాల్లో వర్షాలు
  • సాధారణం కంటే 7 డిగ్రీలు తక్కువగా పగటి ఉష్ణోగ్రత
Rains forcast today and tomorrow in Telangana

తెలంగాణలో గత కొన్ని రోజులుగా ముఖం చాటేసిన వర్షాలు మళ్లీ మొదలయ్యాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారం రాత్రి వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. ఇవి నేడు, రేపు కూడా కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

తెలంగాణపై 5.9 కిలోమీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడడంతోపాటు రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని పేర్కొంది. దీని ప్రభావంతో నేడు, రేపు అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన ఓ మాదిరి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

కాగా, మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో అత్యధికంగా 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, మెదక్‌లోని దొంగల ధర్మారంలో 10.7, కుమురం భీం జిల్లాలోని దహేగాంలో 10, మెదక్, బూర్గుంపాడులలో 9, జగిత్యాలలోని పెగడపల్లిలో 8, ఇల్లందులో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు, వర్షాల కారణంగా పగటి ఉష్ణోగ్రత సాధారణం కంటే 7 డిగ్రీలు తక్కువ నమోదైంది.

More Telugu News