Akhil Gogoi: బీజేపీలో కానీ, ఆర్ఎస్ఎస్‌లో కానీ చేరితే పది రోజుల్లోనే బెయిలు వస్తుందన్నారు: అఖిల్ గొగొయ్ సంచలన ఆరోపణ

  • జైలు నుంచే పోటీ చేసి విజయం సాధించిన అఖిల్
  • ఉపా చట్టం కింద నమోదైన కేసుల్లోనూ నిర్దోషిగా తేలిన వైనం
  • బీజేపీలో చేరితే మంత్రి పదవి వస్తుందని ఎన్ఐఏ ఆఫర్ చేసిందన్న గొగొయ్
  • సీబీఐ, ఈడీలానే ఎన్ఐఏ కూడా రాజకీయ సంస్థగా మారిందని ఆరోపణ
akhil gogoi said uapa is being misused like nia and ed

చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం (ఉపా) కింద అరెస్ట్ అయి జైలు నుంచే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన అసోంకు చెందిన రైజోర్ దళ్ అధినేత, ఆర్టీఐ కార్యకర్త అఖిల్ గొగొయ్ సంచలన ఆరోపణలు చేశారు.

జైలు నుంచి విడుదలైన అనంతరం ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అఖిల్ మాట్లాడుతూ.. తాను బీజేపీలోకి కానీ, ఆర్ఎస్ఎస్‌లో కానీ చేరితే పది రోజుల్లోనే బెయిలు వస్తుందని, లేదంటే పదేళ్లపాటు జైలులోనే గడపాల్సి వస్తుందని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తనను హెచ్చరించిందని సంచలన ఆరోపణ చేశారు. అంతేకాదు, బీజేపీలో చేరితే మంత్రి పదవి కూడా వస్తుందని ఆఫర్ చేసిందన్నారు.

అయితే, ఎన్ఐఏ ఆఫర్‌ను తాను తిరస్కరించినట్టు చెప్పారు. ఉపా చట్టం కింద తనపై నమోదైన రెండు అభియోగాలను కోర్టు కొట్టివేయడాన్ని చారిత్రాత్మకమైన తీర్పుగా పేర్కొన్న అఖిల్.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్ఐఏను ఓ అస్త్రంగా వాడుకుంటోందన్నారు. సీబీఐ, ఈడీలానే ఎన్ఐఏ కూడా ఓ రాజకీయ సంస్థలా మారిపోయిందని ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా 2019 డిసెంబరులో అసోంలో జరిగిన హింసాత్మక ఘటనల వెనక అఖిల్ పాత్ర ఉందని ఆరోపిస్తూ ఎన్ఐఏ రెండు అభియోగాలు నమోదు చేసింది. అఖిల్ ఇప్పటికే ఓ కేసులో నిర్దోషిగా తేలగా, రెండో కేసులోనూ గురువారం నిర్దోషిగా తేలడంతో జైలు నుంచి విడుదలయ్యారు.

More Telugu News