Punjab: పంజాబ్​ సీఎం అమరీందర్​ పై ఆగని సిద్ధూ విమర్శలు.. విద్యుత్ కోతలపై మండిపాటు

  • ప్రియాంక, రాహుల్ తో భేటీ తర్వాతా మారని తీరు
  • ఎక్కువ ధరకు విద్యుత్ ను కొంటున్నామని ఆగ్రహం
  • విద్యుత్ నిర్వహణపై ప్రభుత్వానికి పలు సూచనలు
Sidhu Fires On Amarinder Over Power Cuts Issue

పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ పై నవ్ జోత్ సింగ్ సిద్ధూ మరోసారి ఫైర్ అయ్యారు. ఇటీవలే ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలతో ఆయన సమావేశమైనా.. వర్గపోరు సమసినట్టు కనిపించడం లేదు. తాజాగా రాష్ట్రంలో విద్యుత్ కోతలపై ఆయన నిరసన గళం వినిపించారు. కరెంట్ ధరలు, కోతలు, విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలు, 24 గంటల ఉచిత కరెంట్ వంటి వాటిపై ‘వాస్తవాలు’ అంటూ కొన్ని విషయాలను వెల్లడించారు.

ఆఫీసు పనివేళలను నియంత్రించేందుకు లేదా ప్రజలు ఏసీ వాడకుండా చేయడం కోసం పంజాబ్ ముఖ్యమంత్రికి కరెంట్ కోతలే పరిష్కారం కాదని అన్నారు. సరైన దిశలో వెళ్తే పరిష్కారం దొరుకుతుందని హితవు చెప్పారు. పంజాబ్ సగటున ఒక్కో యూనిట్ కు రూ.4.54 ఖర్చు చేస్తోందని, అయితే జాతీయ సగటు ధర మాత్రం కేవలం రూ.3.85 అని గుర్తు చేశారు. చండీగఢ్ కేవలం రూ.3.44 చెల్లిస్తోందన్నారు. 3 ప్రైవేట్ థర్మల్ ప్లాంట్ల మీద ఆధారపడడం వల్ల ఒక్కో యూనిట్ కు రూ.5 నుంచి రూ.8 వరకు ఖర్చవుతోందని అన్నారు.

బాదల్ హయాంలోనే ఆ మూడు సంస్థలతో విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలు జరిగాయని సిద్ధూ గుర్తు చేశారు. ఆ ఒప్పందాల్లోని లొసుగుల వల్ల 2020 దాకా పంజాబ్ ప్రభుత్వం.. వాటికి రూ.5,400 కోట్లు చెల్లించాల్సి వచ్చిందన్నారు. మున్ముందు మరో రూ.65 వేల కోట్లు చెల్లించాల్సి రావొచ్చని అసహనం వ్యక్తం చేశారు.

సాధారణంగా అయితే జాతీయ గ్రిడ్ నుంచి తక్కువ ధరలకే విద్యుత్ ను కొనే అవకాశం ఉన్నా.. ప్రజా ప్రయోజనాలను తాకట్టు పెట్టి ప్రైవేటు సంస్థల నుంచి బాదల్ ప్రభుత్వం విద్యుత్ ను అధిక ధరలకు కొనుగోలు చేసిందని చెప్పారు. ప్రస్తుతం ఆ సంస్థలకు న్యాయ సంరక్షణ ఉన్నందున ఆ ఒప్పందాలను సవరించలేమని, అయితే, అందుకూ ఓ దారి ఉందని సూచించారు.

నేషనల్ పవర్ ఎక్స్ చేంజ్ వద్ద ధరల ప్రకారం.. విద్యుత్ ధరలపై పరిమితులు విధిస్తూ అసెంబ్లీలో చట్టం చేస్తే ధరలను నియంత్రించవచ్చని సూచించారు. కాబట్టి చట్టంలో సవరణలు చేయడం ద్వారా మునుపటి ఒప్పందాలన్నీ రద్దయిపోతాయని, ప్రజల డబ్బును ఆదా చేయవచ్చని చెప్పారు.

విద్యుత్ లో యూనిట్ ఆదాయం పంజాబ్ లోనే అత్యంత తక్కువగా ఉందన్నారు. ప్రజలకు సరఫరా చేసే ప్రతి యూనిట్ పైనా పంజాబ్ విద్యుత్ సరఫరా సంస్థలు 0.18 పైసలు నష్టపోవాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వం నుంచి రూ.9 వేల కోట్ల సబ్సిడీ వస్తున్నా నష్టాలే మిగిలాయన్నారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో పర్యావరణహిత విద్యుత్ వనరులకు డిమాండ్ పెరిగిందని, పైగా ధర కూడా తక్కువని ఆయన సూచించారు. కానీ, పంజాబ్ మాత్రం ఇప్పటిదాకా సౌరవిద్యుత్ లాంటి వాటిని వినియోగించుకోలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం అందుతున్నా దానివైపు చూడడం లేదని విమర్శించారు.

ప్రైవేటు సంస్థలకు అనవసర లాభాలను చేకూర్చే బదులు.. ఆ సొమ్మును ప్రజా సంక్షేమం కోసం వినియోగించవచ్చని ఆయన చెప్పారు. గృహ వినియోగం కోసం ఇచ్చే ఉచిత విద్యుత్ కు సబ్సిడీలను అందించొచ్చని చెప్పారు. 24 గంటల కరెంట్ ను కోతల్లేకుండా సరఫరా చేయొచ్చని చెప్పారు. విద్య, వైద్య రంగంలో పెట్టుబడిగా పెట్టొచ్చని పేర్కొన్నారు.

More Telugu News