G Jagadish Reddy: జగన్ ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారు: తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శలు

  • కృష్ణా జలాల దోపిడీలో వైయస్సార్ ను జగన్ మించిపోతున్నారు
  • కేసీఆర్ చాచిన స్నేహ హస్తాన్ని జగన్ మరిచిపోయారు
  • ప్రజలను మోసం చేయడానికే కేంద్రానికి లేఖలు రాస్తున్నారు
TS minister Jagadish Reddy criticises AP CM Jagan

కృష్ణా జలాల వ్యవహారంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదం రాజుకున్న సంగతి తెలిసిందే. తమ రాష్ట్ర వాటా జలాలను కూడా ఏపీ ప్రభుత్వం అక్రమంగా తరలించుకుపోతోందని తెలంగాణ మంత్రులు వ్యాఖ్యానిస్తున్నారు. దివంగత సీఎం వైయస్సార్ తో పాటు, ప్రస్తుత సీఎం జగన్ ను తీవ్ర పదజాలంతో విమర్శిస్తున్నారు. వైయస్సార్ దొంగ అయితే, జగన్ గజదొంగ అంటూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. తాజాగా జగన్ పై తెలంగాణకు చెందిన మరో మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ చాచిన స్నేహ హస్తాన్ని మరిచి, జగన్ ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారని జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. కేంద్రానికి లేఖ రాసే పరిస్థితిని ఏపీ ప్రభుత్వమే తెచ్చుకుందని అన్నారు. ప్రజలను మోసం చేయడానికే కేంద్రానికి జగన్ లేఖలు రాస్తున్నారని దుయ్యబట్టారు. సమస్యను వారే సృష్టించి, మళ్లీ దాన్ని పరిష్కరించమని వారే అడగటం ప్రజలను మోసం చేయడమేనని అన్నారు.

కృష్ణా జలాల దోపిడీలో తండ్రి  వైయస్ ను జగన్ మించిపోతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చట్టపరంగా తమకు ఉన్న హక్కుతోనే శ్రీశైలం ప్రాజెక్టు వద్ద విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నామని అన్నారు. పోతిరెడ్డిపాడు, రాయలసీమ లిఫ్ట్ పథకాల జీవోలను ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

More Telugu News