Panzab: కరెంట్ లేక పంజాబ్ లో ప్రభుత్వ కార్యాలయాల పని వేళల తగ్గింపు!

  • పంజాబ్ లో విద్యుత్ ఉద్యోగుల సమ్మె
  • ఉద్యోగులతో చర్చించేందుకు ప్రత్యేక కమిటీ
  • సమ్మెను విరమించాలన్న సీఎం అమరీందర్ సింగ్
  • ఆఫీసులు మధ్యాహ్నం 2 గంటల వరకే
Govt Offices Timings Shorten in PanzabAmid Power Shortages

ఒకవైపు తగ్గని ఎండలతో ఉక్కపోత, మరోవైపు విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో కరెంట్ కొరత పెరిగిపోవడంతో ప్రభుత్వ కార్యాలయాల్లో పని వేళలు తగ్గిస్తున్నట్టు ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ వెల్లడించారు. ఈ ఉత్తర్వులు జులై 10 వరకూ అమలులో వుంటాయని తెలిపారు. తమ నిరసనలను విరమించి విద్యుత్ ఉద్యోగులు వెంటనే విధుల్లోకి చేరాలని కెప్టెన్ కోరారు. ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ వాడకాన్ని తగ్గించాలని సూచించారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే ఆఫీసులు పనిచేస్తాయని అన్నారు.

ఆఫీసుల్లో ఎయిర్ కండిషనర్ ల వాడకాన్ని నిషేధిస్తూ ఎటువంటి అధికారిక ఆదేశాలూ జారీ కాకున్నా, అంతర్గతంగా ఏసీలు వేసుకోరాదని అన్ని విభాగాలకూ ఉన్నతాధికారుల నుంచి సూచనలు వెళ్లినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 14,500 మెగావాట్లకు విద్యుత్ డిమాండ్ ఉండగా, దాన్ని అందించలేని స్థితిలో విద్యుత్ శాఖ ఉంది. తమ న్యాయమైన కోరికలను తక్షణం నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ ఉద్యోగులు సమ్మె చేస్తుండటంతో పరిస్థితి మరింత దిగజారింది. విద్యుత్ ఫీడర్లపై ఓవర్ లోడ్ పడి, సబ్ స్టేషన్లు ట్రిప్ అవుతుండగా, వాటిని రీస్టార్ట్ చేసేవారు కూడా లేకపోవడం గమనార్హం

దీంతో ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ఓ కమిటీని ప్రకటించారు. ఈ కమిటీ వెంటనే ఉద్యోగులతో సమావేశమై వారి డిమాండ్లకు పరిష్కార మార్గాలపై చర్చించనుంది. పంజాబ్ లో ఈ సీజన్ పంట నాట్లు వేసే సమయంలో విద్యుత్ ఉద్యోగుల సమ్మె రైతులకు తీవ్ర ఇబ్బందిగా మారింది.

More Telugu News