Russia: మరోమారు రికార్డులకెక్కిన రష్యా.. ప్రజలకు మూడో డోసు పంపిణీ షురూ!

  • రష్యాలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్
  • రాజధాని మాస్కోలో మొదలైన బూస్టర్ డోసు పంపిణీ
  • ఆరు నెలలకు ఒకసారి బూస్టర్ డోసు ఇచ్చే యోచన
Russia launches booster shots amid soaring infections

కరోనా వ్యాక్సిన్‌ను మొట్టమొదట రిజిస్టర్ చేసుకున్న దేశంగా రికార్డులకెక్కిన రష్యా ఇప్పుడు మరోమారు వార్తలకెక్కింది. ప్రస్తుతం ఆ దేశంలో కరోనా వైరస్ మరోమారు విజృంభిస్తుండడంతో బూస్టర్ డోసు పంపిణీకి సిద్ధమైంది. టీకాల లేమి కారణంగా చాలా దేశాలు తమ ప్రజలకు టీకా తొలి డోసు ఇచ్చేందుకే నానా కష్టాలు పడుతున్నాయి. రష్యా మాత్రం మూడో డోసు పంపిణీ చేపట్టినట్టు ప్రకటించి ఈ విషయంలో మొదటి స్థానంలో నిలిచింది.

రెండో డోసు తీసుకుని ఆరు నెలలు అయిన వారికి మూడో డోసు ఇవ్వాలని నిర్ణయించింది. అంతేకాకుండా ప్రతి ఆరు నెలలకు ఒకసారి బూస్టర్ డోసు ఇవ్వాలని కూడా యోచిస్తోంది. ఈ క్రమంలో రాజధాని మాస్కోలో నిన్నటి నుంచే బూస్టర్ డోసు పంపిణీ మొదలైంది. తాజాగా వెలుగు చూస్తున్న కొత్త వేరియంట్లను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.

తొలి రెండు డోసుల వల్ల శరీరంలో వృద్ధి చెందే యాంటీబాడీలు ఆరు నెలల తర్వాత క్షీణిస్తున్నట్టు నివేదికలు చెబుతుండడం, ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లు తొలి రోజుల్లో వెలుగు చూసిన వేరియంట్‌ను ఆధారంగా చేసుకుని రూపొందించినవి కావడంతో రష్యా సహా చాలా దేశాలు మూడో డోసు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి.

More Telugu News