Nirmala Sitharaman: జీఎస్టీ రెవెన్యూ వసూళ్లు ఇక పైపైకే: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​

  • 8 నెలలుగా రూ.లక్ష కోట్లపైనే వసూళ్లు
  • 66.25 లక్షల నుంచి 1.28 కోట్లకు పెరిగిన ట్యాక్స్ పేయర్లు
  • ఇవ్వాళ్టికి జీఎస్టీని తీసుకొచ్చి నాలుగేళ్లు
Nirmala Sitharaman Says GST Revenue Collection is New Normal

ఇటీవలి కాలంలో వస్తు సేవా పన్ను (జీఎస్టీ) రెవెన్యూ వసూళ్లు బాగా పెరిగాయని, ఇకపై ఎల్లప్పుడూ పెరుగుతూనే ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. జీఎస్టీ చెల్లింపుల్లో మోసాలను అధికారులు అరికట్టగలిగారని ఆమె కొనియాడారు. జీఎస్టీని ప్రారంభించి నాలుగేళ్లు అయిన సందర్భంగా ఆమె మాట్లాడారు. సమయానికి జీఎస్టీ రిటర్నులను దాఖలు చేసి పన్ను కట్టిన 54,439 మందికి ప్రశంసా పత్రాలను అందజేశారు. అందులో 88 శాతం మంది సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు చెందిన వారే కావడం విశేషం.

జీఎస్టీని ప్రవేశపెట్టిన ఈ నాలుగేళ్లలో పన్ను కట్టే వారి సంఖ్య 66.25 లక్షల నుంచి 1.28 కోట్లకు రెట్టింపైందని నిర్మలా సీతారామన్ చెప్పారు. వరుసగా 8 నెలల పాటు ప్రతి నెలా రూ.లక్ష కోట్లకు పైగా జీఎస్టీ వసూలైందన్నారు. అత్యధికంగా ఏప్రిల్ లో రూ.1.41 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు జరిగాయని చెప్పారు. ఈ అత్యధిక వసూళ్లు ఇకపైనా కొనసాగుతాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

జీఎస్టీ చెల్లింపుదారుల ఆందోళనలను జీఎస్టీ మండలి ఎప్పటికప్పుడు తెలివిగా పరిష్కరించిందని ప్రశంసించారు. జీఎస్టీ వచ్చాక పరిశ్రమలకు పన్ను కట్టడం చాలా సులువైందని, సామాన్యుడిపై పన్ను భారం కూడా తగ్గిందని నిర్మల చెప్పారు. ఎక్సైజ్ డ్యూటీ, సేవా పన్ను, వ్యాట్ వంటి 17 పన్నులు, 13 సుంకాలను కలిపి.. 2017 జులై 1న ఒకే పన్ను ‘జీఎస్టీ’గా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.

More Telugu News