Supreme Court: నిరంకుశ ప్రభుత్వాలు రాకుండా ఎన్నికలు అడ్డుకోలేవు: సీజేఐ ఎన్వీ రమణ

  • అలాంటి హామీ ఏదీ లేదు
  • ప్రజలే సర్వాధికారులు
  • కోర్టులను ప్రభుత్వాలు శాసించరాదు
  • అదే జరిగితే న్యాయాధికారం ఓ భ్రమే
  • మహమ్మారి అంతం ఇక్కడితో ఆగదు
  • రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షోభాలు
Mere Right To Change Ruler Need not Be a Guarantee Against the Tyranny Says CJI

‘అణచివేసే నిరంకుశ ప్రభుత్వాలు’ రాకుండా కొన్నేళ్లకోసారి జరిగే ఎన్నికలు అడ్డుకోలేవని, అలాంటి హామీ ఏదీ లేదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. ప్రజలే సర్వాధికారులు అన్న విషయాన్ని గుర్తించాలన్నారు. అయితే, ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే ప్రజాభిప్రాయాలను ఎల్లప్పుడూ ప్రభుత్వాలు వినాలని హితవు చెప్పారు. నిన్న సాయంత్రం జస్టిస్ పి.డి. దేశాయి 17వ స్మారకోపన్యాసంలో భాగంగా ‘రూల్ ఆఫ్ లా (న్యాయాధికారం)’ అనే అంశంపై ఆయన మాట్లాడారు.

అందులో భాగంగా ఇప్పటివరకు దేశంలో జరిగిన 17 సార్వత్రిక ఎన్నికలను ఆయన ప్రస్తావించారు. ఆ ఎన్నికల్లో 8 సార్లు ప్రభుత్వాలను ప్రజలు మార్చారని గుర్తు చేశారు. దేశంలో భారీగా అసమానతలు, పేదరికం, వెనుకబాటుతనం ఉన్నా.. ప్రజలు తెలివైనవారేనని, వారు తమ పనిని సంపూర్ణంగా నిర్వహించారని ఈ ఎన్నికలే నిరూపిస్తాయన్నారు. ఆ ఎన్నికల్లో ప్రజలందరూ హేతుబద్ధంగా వ్యవహరించారని చెప్పారు.  

కోర్టులను ప్రభుత్వాలు శాసించరాదు

కోర్టులకు పూర్తి స్వేచ్ఛ ఉండాలని సీజేఐ రమణ అన్నారు. ప్రభుత్వాలు, ప్రభుత్వాధికారులు కోర్టులను శాసించరాదని పేర్కొన్నారు. ‘‘ప్రభుత్వాలు లేదా అధికారులు.. కోర్టులను ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ నియంత్రించ కూడదు. అలా జరిగినప్పుడు న్యాయాధికారం అన్నది ఓ భ్రమలా మారుతుంది’’ అని ఆయన అన్నారు. కోర్టులను ఉద్దేశించి ప్రజలు సోషల్ మీడియాలో పెట్టే పోస్టులను చూసి జడ్జిలు భావోద్వేగానికి లోను కావొద్దని సూచించారు. ఆ పోస్టులను అసలు పట్టించుకోవద్దని చెప్పారు.

నిర్ణయాత్మక కేసుల్లో మీడియా ట్రయల్ మంచిది కాదని ఆయన చెప్పుకొచ్చారు. కోర్టులు స్వేచ్ఛగా పనిచేయాలంటే బాహ్య ఒత్తిళ్లను అధిగమించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రభుత్వం నుంచి న్యాయమూర్తులపై ఒత్తిళ్లున్నాయని బయట చర్చ జరుగుతోందని, అయితే, కోర్టులను సోషల్ మీడియా ట్రెండ్స్ ఎలా ప్రభావితం చేస్తాయో కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉందని జస్టిస్ రమణ అభిప్రాయపడ్డారు.

స్వేచ్ఛ, సమానత్వం, కుటుంబం, న్యాయం వంటి వాటిపై స్పృహ పెరిగే కొద్దీ న్యాయాధికారం కూడా మారిపోతూ వస్తోందని ఆయన అన్నారు. అయితే ఇప్పుడు మహమ్మారి సమయంలో సామాన్యుల జీవితాలను కాపాడేందుకు ఆ న్యాయాధికారాన్ని ఎంత వరకు వాడుకున్నారన్నదానిని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మహమ్మారి అంతం ఇక్కడితో అయిపోలేదని అన్నారు. రాబోయే దశాబ్దాల కాలంలో మరిన్ని పెద్ద సంక్షోభాలకు ఇది ఓ తెర లాంటిదని హెచ్చరించారు. కాబట్టి ఈ మహమ్మారి సంక్షోభ సమయంలో మనం ఏది కరెక్ట్ గా చేశాం? ఏ విషయంలో తప్పు చేశాం? అనే విషయాలను బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

More Telugu News