Andhra Pradesh: కృష్ణా బోర్డుకు ఏపీ, తెలంగాణ పోటాపోటీ లేఖలు

  • పులిచింతలలో విద్యుదుత్పత్తిని ఆపివేయించాలంటూ ఏపీ లేఖ
  • ఆర్డీఎస్ కుడికాలవ పనులు ఆపాలన్న తెలంగాణ
  • తమకు నీటి అవసరాలు లేకున్నా వదులుతోందన్న ఏపీ
  • సాగు నీరంతా సముద్రంలో కలుస్తోందని ఆవేదన
AP CS writes letter to Krishnaboard against Telangana

ఏపీ తెలంగాణ మధ్య రాజుకున్న నీటి ప్రాజెక్టుల వివాదం చూస్తుంటే చాలా దూరం వెళ్లేలా కనిపిస్తోంది. ఆర్డీఎస్ కుడికాలువ నిర్మాణ పనులు పునర్విభజన చట్టానికి వ్యతిరేకమంటూ కృష్ణా బోర్డుకు తెలంగాణ సీఎస్‌ లేఖ రాస్తే.. పులిచింతల ప్రాజెక్టులో విద్యుత్‌ను ఉత్పత్తి చేయకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని అడ్డుకోవాలని ఏపీ జలవనరుల శాఖ ఈఎన్‌సీ సి. నారాయణరెడ్డి నిన్న లేఖ రాశారు.

కృష్ణా డెల్టా నీటి అవసరాల కోసం 45.77 టీఎంసీ సామర్థ్యంతో నిర్మించిన పులిచింతల ప్రాజెక్టుకు అనుబంధంగా నిర్మించిన జలవిద్యుత్ కేంద్రం తెలంగాణ అధీనంలో ఉందని, ఇప్పుడీ ప్రాజెక్టులో నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోందని ఆ లేఖలో ఆరోపించారు.

నిజానికి కృష్ణా డెల్టాలో పంటల సాగుకు నీటిని విడుదల చేయాలని ఎస్ఈ (విజయవాడ) ప్రతిపాదించినప్పుడు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి ద్వారా నీటిని దిగువకు విడుదల చేయాలన్నది నిబంధన అని, కానీ  ఇప్పుడు ఆ నియమావళిని తెలంగాణ ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఆరోపించారు. తమ నుంచి ఎలాంటి ప్రతిపాదనలు లేకున్నా మంగళవారం ఉదయం 8 గంటల నుంచి పోలీసుల బందోబస్తు మధ్య ఏకపక్షంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేశారని పేర్కొన్నారు.

కృష్ణా డెల్టాకు నీటి అవసరాలు లేకపోయినా పులిచింతల నుంచి నీటిని విడుదల చేస్తున్నారని, దీనివల్ల ప్రకాశం బ్యారేజీ ద్వారా ఆ నీరంతా వృథాగా సముద్రంలోకి చేరుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలు తుంగలో తొక్కి పులిచింతలలో అక్రమంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్న తెలంగాణ జెన్‌కోపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈఎన్‌సీ నారాయణరెడ్డి ఆ లేఖలో డిమాండ్ చేశారు.

More Telugu News