Canada: కెనడాలో భరించలేని వేడి... ఇప్పటివరకూ 240 మంది కన్నుమూత!

  • రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
  • హై అలర్ట్ ప్రకటించిన అధికారులు
  • వాంకోవర్ లో 135 మంది మృతి
  • వీధుల్లో తాత్కాలిక ఫౌంటెయిన్ లు, నీటి జల్లు కేంద్రాలు
  • పూర్తి కెపాసిటీలో పని చేయనున్న ఏసీ థియేటర్లు
Over 240 Died in Canada Over Heat Wave

కెనడా ఇప్పుడు భానుడి ప్రతాపాన్ని తాళలేక బెంబేలెత్తుతోంది. ఆల్ టైమ్ రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు ఇప్పటికే ప్రజల జీవితాన్ని అతలాకుతలం చేయగా, ఇప్పటివరకూ 240 మంది ఎండ వేడిమిని, వడగాడ్పులను తట్టుకోలేక కన్నుమూశారు.దీంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించడంతో పాటు అత్యవసరమైతేనే ప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలని సూచించారు.

వాంకోవర్ లో పరిస్థితి మరింత భీతావహంగా ఉంది. ఇక్కడే సుమారు 135 మంది మృత్యువాతపడ్డారు. చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, కరోనా టీకా కేంద్రాలను, స్కూళ్లను మూసివేశారు. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ టీకాల పంపిణీ ఉండబోదని అధికారులు తెలిపారు. ఎండ నుంచి ఉపశమనానికి నడి రోడ్లపై టెంపరరీ వాటర్ ఫౌంటెయిన్ లు, నీటి జల్లు కేంద్రాలను, పలు ప్రాంతాల్లో కూలింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇక స్విమ్మింగ్ పూల్స్, బీచ్ ల వద్ద ప్రజల సందడి అధికంగా ఉంది.

ఇక యూఎస్ లోని పలు ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ముఖ్యంగా పోర్ట్ లాండ్, ఓరెగాన్, సియాటెల్, వాషింగ్టన్ ప్రాంతాల్లో విద్యుత్ కు డిమాండ్ పెరుగగా, సరఫరాకు అంతరాయాలు ఏర్పడ్డాయి. వెస్ట్ యూఎస్ లోని 4 కోట్ల మందిని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరికొంత కాలం పాటు అధికంగా నమోదు కావచ్చని, అందరూ జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. యూఎస్ లోని 11 జిల్లాల్లో రికార్డు స్థాయిలో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఎయిర్ కండిషన్ సౌకర్యం ఉన్న సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్ లో పూర్తి స్థాయిలో ప్రజలను అనుమతించాలని ప్రభుత్వం ఆదేశించింది.

More Telugu News