NIA: హైదరాబాదులో లష్కరే తోయిబా ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ

NIA arrests two persons in Hyderabad
  • జూన్ 17న బీహార్ లో పేలుళ్లు
  • దర్భంగా రైల్వేస్టేషన్ లో ఘటన
  • మూలాలను హైదరాబాదులో గుర్తించిన ఎన్ఐఏ
  • నాసిర్, ఇమ్రాన్ అనే సోదరుల అరెస్ట్
జూన్ 17న బీహార్ లోని దర్భంగా రైల్వేస్టేషన్ లో ఓ ఘటన జరిగింది. రైలు బోగీ నుంచి పార్శిళ్లు కిందికి దింపుతుండగా పేలుడు జరిగింది. ఓ సీసా నుంచి పొగలు వచ్చి, ఆపై పేలుడు జరిగినట్టు వెల్లడైంది. దీన్ని లోతుగా పరిశోధించడంతో ఇది ఉగ్రదాడి అని తేలింది. పైగా దీని లింకులు హైదరాబాదులో ఉన్నట్టు గుర్తించారు.

ఈ క్రమంలో ఈ కేసు విచారణను స్వీకరించిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) హైదరాబాదులో నేడు నాసిర్ ఖాన్, ఇమ్రాన్ ఖాన్ అనే ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులను అరెస్ట్ చేసింది. వీరే అనుమానాస్పద పార్శిల్ ను సికింద్రాబాద్ లో బుక్ చేసినట్టు భావిస్తున్నారు. వీరిద్దరూ అన్నదమ్ములు. నాసిర్ ఖాన్ తొమ్మిదేళ్ల కిందట పాకిస్థాన్ వెళ్లి ఉగ్రశిక్షణ పొందాడు. రసాయనాలతో పేలుడు పదార్థాలు చేయడంలో ఆరితేరాడు. ఆపై హైదరాబాద్ వచ్చి సోదరుడు ఇమ్రాన్ తో కలిసి ఐఈడీ తయారుచేశాడు.

 అనంతరం ఓ వస్త్రాల పార్శిల్లో పేలుడు పదార్థాలతో కూడిన సీసా ఉంచారు. దాన్ని సికింద్రాబాద్-దర్భంగా రైల్లో పంపారు. ఈ పార్శిల్ బోగీ నుంచి అన్ లోడ్ చేస్తున్న సమయంలోనే పేలుడు జరిగింది. ప్రస్తుతం ఈ సోదరులిద్దరినీ ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు. వీరిద్దరూ ఇంకేమైనా కుట్రలు పన్నారా? అనే కోణంలో ప్రశ్నిస్తున్నారు.
NIA
LeT
Darbhanga
Bihar
Explosion
Hyderabad
Telangana
India

More Telugu News