Congress: రాహుల్‌ గాంధీతో సిద్ధూ భేటీ!

  • పంజాబ్‌ కాంగ్రెస్‌లో విభేదాలు
  • సిద్ధూ, సీఎం మధ్య పొరపొచ్చాలు
  • ఢిల్లీకి చేరిన పంచాయితీ
  • కమిటీ ఏర్పాటు చేసిన అధిష్ఠానం
  • నేడు రాహుల్‌, ప్రియాంకతో భేటీ అయిన సిద్ధూ
Navjot Sidhu Meets Rahul Gandhi In Delhi

పంజాబ్‌ కాంగ్రెస్‌లో విభేదాలకు కేంద్ర బిందువుగా మారిన మాజీ క్రికెటర్‌, ఎమ్మెల్యే నవజోత్‌ సింగ్‌ సిద్ధూ నేడు పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీతో భేటీ అయ్యారు. ప్రస్తుతం వీరిరువురి మధ్య సమావేశం కొనసాగుతోంది. అయితే, వీరు ఏం చర్చిస్తున్నారన్నది మాత్రం తెలియరాలేదు.

రాష్ట్ర ముఖ్యమంత్రితో విభేదాలు తారస్థాయికి చేరిన తర్వాత సిద్ధూ ఢిల్లీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ప్రియాంక, రాహుల్‌తో భేటీ కానున్నానని కొన్ని రోజులు క్రితం ఆయన తెలిపారు. కానీ, ఈరోజు వరకు అది సాధ్యం కాలేదు. మరోవైపు సిద్ధూతో సమావేశం తన ప్రణాళికలో లేదని రాహుల్‌ నిన్న వ్యాఖ్యానించారు. తిరిగి ఒక్కరోజులోనే ఇరువురు నేతలు సమావేశం కావడం గమనార్హం.

అంతకుముందు ప్రియాంక గాంధీతోనూ సిద్ధూ భేటీ అయ్యారు. సుదీర్ఘ సమయం పాటు ఆమెతో చర్చలు జరిపినట్లు తెలిపారు. ఈ మేరకు వారిరువురు కలిసి దిగిన ఫొటోను ట్విట్టర్‌లో పంచుకున్నారు.  అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, తాను పోషించబోయే పాత్ర గురించి ప్రియాంకతో చర్చించానని తెలిపారు.

పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌తో సిద్ధూ విభేదిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విభేదాలు తలెత్తాయి. దీన్ని చక్కబెట్టడానికి పార్టీ అధిష్ఠానం ఓ కమిటీని నియమించింది. అమరీందర్‌ ఇటీవలే ఈ కమిటీ ముందు హాజరయ్యారు. సిద్ధూ మాత్రం ఇప్పటి వరకు కమిటీ సభ్యులతో భేటీ కాలేదు.

More Telugu News