Mamata Banerjee: మమతా బెనర్జీకి, బెంగాల్ ప్రభుత్వానికి జరిమానా విధించిన కలకత్తా హైకోర్టు

  • టీఎంసీ నేతలను అరెస్ట్ చేసిన సీబీఐ
  • సీబీఐ కార్యాలయంలో నిరసన వ్యక్తం చేసిన మమత
  • కోర్టులను ఆశ్రయించిన మమత
Calcutta High court fines Mamata Banerjee government

మమతా బెనర్జీకి, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి కలకత్తా హైకోర్టు జరిమానా విధించింది. వివరాల్లోకి వెళ్తే, ఇద్దరు మంత్రులు సహా నలుగురు టీఎంసీ నేతలను మే 17న సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ అరెస్టులను నిరసిస్తూ సీబీఐ కార్యాలయంలో మమత నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో దీదీ తీరుపై సీబీఐ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ కేసును హైకోర్టు విచారించింది. దీనికి సంబంధించి జూన్ 9న హైకోర్టుకు మమత, రాష్ట్ర న్యాయ మంత్రి, రాష్ట్ర ప్రభుత్వం సమాధాన పత్రాలను సమర్పించారు. అయితే తాము చెప్పిన సమయానికి కాకుండా ఇష్టం వచ్చినప్పుడు అఫిడవిట్లు సమర్పిస్తే తాము స్వీకరించబోమని హైకోర్టు వ్యాఖ్యానించింది.

దీంతో మమత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పుపై స్టే విధించిన సుప్రీంకోర్టు... మమత తదితరులు ఇచ్చిన సమాధానాన్ని హైకోర్టు స్వీకరించకపోవడం చట్టబద్ధం కాదని వ్యాఖ్యానించింది. వీరి అఫిడవిట్లను రికార్డు చేయడంతో పాటు, తొలి నుంచి విచారణ ప్రారంభించాలని హైకోర్టును ఆదేశించింది. దీంతో, కొత్తగా అఫిడవిట్లు దాఖలు చేసేందుకు అనుమతినివ్వాలంటూ మమత హైకోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తును హైకోర్టు స్వీకరించింది. అయితే, సరైన సమయంలో అఫిడవిట్లు దాఖలు చేయనందుకు మమతకు, ప్రభుత్వానికి రూ. 5 వేల జరిమానా విధించింది.

More Telugu News