Revanth Reddy: ఓవైపు కరోనా, మరోవైపు కేసీఆర్... ప్రజలకు వేధింపులు తప్పడంలేదు: రేవంత్ రెడ్డి

Revanth Reddy held meeting with DCC Presidents in Hyderabad
  • టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి
  • నేడు డీసీసీ అధ్యక్షులతో సమావేశం
  • సీఎం కేసీఆర్ పై విమర్శనాస్త్రాలు
  • కేసీఆర్ దిగిపోతే సమస్యలు పోతాయని వెల్లడి
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితుడైన రేవంత్ రెడ్డి ఇవాళ అన్ని జిల్లాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో ఓవైపు కరోనా, మరోవైపు కేసీఆర్... ప్రజలను వేధింపులకు గురిచేస్తున్నట్టు పేర్కొన్నారు. కరోనాతో పేదల జీవితాలు దుర్భరంగా మారాయని అన్నారు. కేసీఆర్ అధికార పీఠం నుంచి దిగిపోతే రాష్ట్రంలో సమస్యలు కూడా తొలగిపోతాయని అభిప్రాయపడ్డారు.

రాష్ట్రంలో ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంతో ఒక తరం యువతకు తీరని నష్టం జరిగిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో 90 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, గత 7 సంవత్సరాలుగా తెలంగాణలో ఉద్యోగ నియామకాలు చేపట్టలేదని ఆరోపించారు.

కాగా, టీపీసీసీ అధ్యక్షుడిగా నియమితుడైన రేవంత్ రెడ్డిని ఇవాళ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత, మాజీ మంత్రి కొండా సురేఖ మర్యాదపూర్వకంగా కలిశారు. రేవంత్ రెడ్డికి మిఠాయి తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. దీనిపై రేవంత్ రెడ్డి ట్విట్టర్ లో స్పందిస్తూ, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పునర్ వైభవం తెచ్చేందుకు కలసికట్టుగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు.
Revanth Reddy
TPCC President
DCC Presidents
CM KCR
Konda Surekha
Congress
Telangana

More Telugu News