mithali raj: 'రాజీవ్ గాంధీ ఖేల్ ర‌త్న'కు మిథాలీ రాజ్‌, అశ్విన్‌ల పేర్లను ప్ర‌తిపాదించ‌నున్న‌ బీసీసీఐ!

  • కేఎల్ రాహుల్‌,  జ‌స్ప్రిత్ బుమ్రా, శిఖ‌ర్ ధావ‌న్ పేర్ల‌ను అర్జున అవార్డుల‌కు
  • చ‌ర్చ‌లు జ‌రిపామ‌న్న‌ బీసీసీఐ వ‌ర్గాలు
  • త్వ‌ర‌లోనే కేంద్రానికి లేఖ‌
BCCI recommends Mithali Raj and Ashwins name for Khel Ratna Award

భారత దేశ అత్యున్నతమైన క్రీడా పురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్ ర‌త్నకు టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌, మ‌హిళా క్రికెట‌ర్ మిథాలీ రాజ్‌ల పేర్ల‌ను బీసీసీఐ ప్ర‌తిపాదించ‌నుంది. ఈ మేర‌కు కేంద్ర ప్ర‌భుత్వానికి లేఖ రాయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. అలాగే, క్రికెట‌ర్లు కేఎల్ రాహుల్‌, జ‌స్ప్రిత్ బుమ్రా, శిఖ‌ర్ ధావ‌న్ పేర్ల‌ను అర్జున అవార్డుల‌కు ప్ర‌తిపాదించ‌నుంది.

ఈ విష‌యంపై ఇప్ప‌టికే తాము చ‌ర్చ‌లు జ‌రిపామ‌ని బీసీసీఐ వ‌ర్గాలు మీడియాకు తెలిపాయి. కాగా, ఈ ఏడాదికి గాను క్రీడా పురస్కారాల నామినేషన్లు, దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఇప్ప‌టికే కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ప్ర‌క‌ట‌న చేసింది. ఈ నెల 21 తేదీతో ముగిసిన‌ దరఖాస్తుల గడువును మ‌రికాస్త పెంచింది. పుర‌స్కారాల‌కు అర్హత ఉన్న‌ క్రీడాకారులు, కోచ్‌లు, ఆయా సంస్థలు, విశ్వవిద్యాలయాలు తమ దరఖాస్తులను మెయిల్ చేయాల‌ని పేర్కొంది.

గ‌త ఏడాది టేబుల్‌ టెన్నిస్ సంచ‌ల‌నం మనిక బాత్, క్రికెట‌ర్ రోహిత్ శ‌ర్మ, రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌, హాకీ ప్లేయ‌ర్ రాణీ రాంపాల్, రియో పారా ఒలింపిక్స్‌ గోల్డ్ మెడలిస్ట్‌ మరియప్పన్‌ తంగవేలుకు ఖేల్ ర‌త్న అవార్డు ద‌క్కిన విష‌యం తెలిసిందే. మొట్ట‌మొద‌టి సారి ఐదుగురు క్రీడాకారుల‌కు ఒకే ఏడాది ఖేల్ ర‌త్న అవార్డులు వచ్చాయి.

More Telugu News