COVID19: ‘డెల్టా’పై కొవాగ్జిన్​ ప్రభావం భేష్​: అమెరికా నేషనల్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ హెల్త్​

  • టీకాతో మంచి ఫలితాలొచ్చాయి
  • ప్రతిరక్షకాలు బాగా ఉత్పత్తి అయ్యాయి
  • వ్యాక్సిన్ తీసుకున్న వారి రక్త నమూనాలతో పరిశోధన
  • తమ ‘అడ్జువెంట్’ వల్లేనని కామెంట్
Covaxin Efficacious Against Delta Variant Says US NIH

దేశీయ బయో ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్ .. డెల్టా సహా అన్ని రకాల కరోనా వేరియంట్లపైన సమర్థంగా పనిచేస్తోందని అమెరికాకు చెందిన అత్యున్నత సంస్థ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్) తెలిపింది. రెండు అధ్యయనాలు చేసి సదరు సంస్థ ఈ విషయాన్ని నిర్ధారించింది. కొవాగ్జిన్ తీసుకున్న ప్రజల రక్తనమూనాలను తీసుకుని వారిలోని ప్రతిరక్షకాలపై అధ్యయనాలు చేసింది.

ఆల్ఫా (బీ.1.1.7), డెల్టా (బీ.1.617) వేరియంట్లను ఇది సమర్థంగా ఎదుర్కొంటోందని గుర్తించింది. దీనికి సంబంధించి ఎన్ఐహెచ్ మీడియా ప్రకటన విడుదల చేసింది. కొవాగ్జిన్ చాలా సురక్షితమని, ప్రతిరక్షకాలను మెరుగ్గా తయారు చేయగలుగుతోందని వివరించింది. ఇంకా పబ్లిష్ కాని మూడో దశ క్లినికల్ ట్రయల్స్ లో వ్యాక్సిన్ ప్రభావం 78 శాతంగా ఉందని ఎన్ఐహెచ్ పేర్కొంది.

కరోనా బారినపడి దాని తీవ్రత ఎక్కువుండి ఆసుపత్రిలో చేరిన వారిలో అయితే వ్యాక్సిన్ ప్రభావం వంద శాతమని చెప్పింది. లక్షణాలు లేని వారిలో 70 శాతం ప్రభావం కనబరిచిందని వివరించింది. ఏ రకంగా చూసినా కొవాగ్జిన్ టీకా చాలా చాలా ప్రభావవంతమైనదని ఎన్ఐహెచ్ ప్రశంసించింది. తాము అభివృద్ధి చేసిన అడ్జువెంట్ తో కొవాగ్జిన్ మరింత సమర్థంగా తయారైందని పేర్కొంది.

‘‘నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ ఫెక్షియస్ డిసీజెస్ (ఎన్ఐఏఐడీ) సహకారంతో రూపొందించిన అడ్జువెంట్ ను కొవాగ్జిన్ లో వాడారు. దీంతో సమర్థమైన వ్యాక్సిన్ భారత ప్రజలకు అందుబాటులోకి వచ్చింది’’ అని ఎన్ఐహెచ్ లో భాగమైన ఎన్ఐఏఐడీ డైరెక్టర్ ఆంథోనీ ఫౌచీ అన్నారు.

అమెరికాలోని వైరోవ్యాక్స్ ఎల్ఎల్ సీ అనే సంస్థ అభివృద్ధి చేసిన అల్ హైడ్రాక్సీక్వియం 2 (అల్జెట్–ఐఎండీజీ: అల్యూమినియం హైడ్రాక్సైడ్ జెల్ , ఇమిడిజోక్వినోలిన్ లను కలిపి తయారు చేసిన పదార్థం) అనే అడ్జువెంట్ ను భారత్ బయోటెక్ కొవాగ్జిన్ లో వినియోగించింది. సాధారణంగా వ్యాక్సిన్ లేదా ఔషధ సామర్థ్యాన్ని పెంచేందుకు అడ్జువెంట్లను వినియోగిస్తుంటారు. కొవాగ్జిన్ లో వాడిన అడ్జువెంట్ మిగతా వాటికన్నా శక్తిమంతమైనదని సంస్థ చెబుతోంది. టీఎల్ఆర్7, టీఎల్ఆర్ 8 అనే రిసెప్టర్లను ఇది చాలావేగంగా యాక్టివేట్ చేస్తుందని, శక్తిమంతమైన ప్రతిరక్షకాలు త్వరగా తయారయ్యేలా చూస్తుందని అంటోంది.

More Telugu News