Brazil: వ్యాక్సిన్ కొనుగోలులో అవకతవకలు... ఇండియాతో డీల్ ను వదులుకోనున్న బ్రెజిల్!

  • ఇండియాతో 324 మిలియన్ డాలర్ల డీల్
  • 2 కోట్ల కొవాగ్జిన్ కొనుగోలుకు ఒప్పందం
  • ధర ఎక్కువ పెట్టారని ఆరోపణలు
  • విచారిస్తున్న ఫెడరల్ ప్రాసిక్యూటర్లు
Brazil To Suspend Vaccine Deal with India Over Iregularities

తమ దేశానికి వ్యాక్సిన్ డోస్ ల సరఫరా నిమిత్తం ఇండియాతో గతంలో బ్రెజిల్ కుదుర్చుకున్న 324 మిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని ఆ దేశం భావిస్తోంది. ఈ డీల్ విషయంలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు రావడంతో ఫెడరల్ ప్రాసిక్యూటర్లు విచారణ ప్రారంభించారని ఆరోగ్య మంత్రి మార్సెలో క్విరోగా వెల్లడించారు.

ఈ డీల్ లో భాగంగా అధిక ధరకు టీకాలు కొనుగోలు చేసేందుకు ఒప్పుకున్నారని, వ్యాక్సిన్ కంపెనీలతో చర్చలు కూడా త్వరితగతిన ముగించారని, నియంత్రణా సంఘాల నుంచి అనుమతులు లేకుండానే అధ్యక్షుడు జైర్ బోల్సొనారో సంతకాలు చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ డీల్ గడచిన ఫిబ్రవరిలో కుదరగా, టీకాలకు ఎక్కువ ధర పెట్టారన్నది ఆయనపై వచ్చిన ప్రధాన ఆరోపణ

భారత్ బయోటెక్ తయారు చేస్తున్న 2 కోట్ల కొవాగ్జిన్ డోస్ లను కొనేందుకు బోల్సొనారో డీల్ కుదుర్చుకున్నప్పటి నుంచి ఆయనకు తలనొప్పి ప్రారంభమైంది. ఎంతో మంది డీల్ పారదర్శకంగా సాగలేదని ఆరోపించారు. ఆరోగ్య శాఖలోని ఓ అధికారి కూడా వ్యక్తిగతంగా ఆయన్ను కలిసి డీల్ పై హెచ్చరించారని, అయినా బోల్సొనారో ముందుకే వెళ్లాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.

మొత్తం ఆరోపణలపై విచారణ జరుగుతోందని, డీల్ ను రద్దు చేసుకునే అవకాశాలే అధికమని తాజాగా జరిగిన మీడియా సమావేశంలో మార్సెలో వ్యాఖ్యానించారు. అయితే, ఈ విషయంలో అవకతవకలు జరిగాయనడానికి ప్రాథమికంగా ఎటువంటి ఆధారాలు లేవని పేర్కొన్న ఆయన, ధర అధికంగా ఉన్న కారణంగా డీల్ ను రద్దు చేసుకోవాలని ఆలోచిస్తున్నామని, తుది నిర్ణయం తీసుకునే ముందు మరింతగా విశ్లేషిస్తామని తెలిపారు.

కాగా, ఇప్పటికే ఈ డీల్ ను రద్దు చేసుకోవాలని బ్రెజిల్ నిర్ణయించుకున్నట్టు రాయిటర్స్, సీఎన్ఎన్ తదితర వార్తా సంస్థలు ప్రత్యేక కథనాలను ప్రచురించాయి. ఈ కాంట్రాక్టు విషయమై విచారించేందుకు సెనేట్ ప్యానల్ కూడా రంగంలోకి దిగడం గమనార్హం.

More Telugu News