Inter Faith Marriage: మతాంతర వివాహాలను ఆపాలంటున్న అత్యధికులు: తాజా సర్వే

  • 26 రాష్ట్రాల్లో సర్వే నిర్వహించిన ప్యూ రీసెర్చ్ సెంటర్
  • 65 శాతానికి పైగా మతాంతర వివాహాలకు వ్యతిరేకమే
  • క్రిస్టియన్లు, బౌద్ధుల్లో మాత్రం భిన్నమైన అభిప్రాయాలు
A New Survey Shows Every Two in Three want to stop Interfaith Marriages

ఇండియాలోని ప్రతి ముగ్గురిలో ఇద్దరు మతాంతర వివాహాలకు వ్యతిరేకంగా ఉన్నారు. ఈ విషయాన్ని ప్యూ రీసెర్చ్ సెంటర్ తన తాజా సర్వేలో వెల్లడించింది. 'రిలిజియన్ ఇన్ ఇండియా: టాలరెన్స్ అండ్ సెగ్రిగేషన్' పేరిట సర్వే చేసిన ప్యూ, మొత్తం 29,999 మందిని ప్రత్యక్షంగా కలిసి అభిప్రాయాలను తీసుకుంది. మొత్తం 26 రాష్ట్రాల్లో తమ ప్రతినిధులు పర్యటించారని ప్యూ వెల్లడించింది.

సర్వేలో వెల్లడైన వివరాల్లోకి వెళితే, అమ్మాయిలలో జరిగే మతాంతర వివాహాలు ఆపాలని 67 శాతం మంది, అబ్బాయిలు మతాంతర వివాహాలు చేసుకోవడాన్ని నిషేధించాలని 65 శాతం మంది వ్యాఖ్యానించారు. మతాల వారీగా సర్వే వివరాలను క్రోఢీకరిస్తే, వ్యత్యాసం కనిపించింది.

సర్వేలో పాల్గొన్న వారిలో 67 శాతం మంది హిందువులు, 80 శాతం ముస్లింలు, 59 శాతం మంది సిక్కులు, 66 శాతం మంది జైనులు.. తమ మతాలకు చెందిన అమ్మాయిలు ఇతర మతాల యువకులను వివాహం చేసుకోవడాన్ని నిషేధించాలని కోరారు. ఇదే సమయంలో హిందువుల్లో 65 శాతం, ముస్లింలలో 76 శాతం, సిక్కుల్లో 58 శాతం, జైనుల్లో 59 శాతం పురుషులు మతాంతర వివాహాలు చేసుకోవడానికి వ్యతిరేకమని వ్యాఖ్యానించారు.

ఇక క్రిస్టియన్లు, బౌద్ధుల్లో అభిప్రాయాలు మారాయి. క్రిస్టియన్లలో 37 శాతం మంది, బౌద్ధుల్లో 46 శాతం మంది మాత్రమే తమ అమ్మాయిలు ఇతర మతాల వారిని పెళ్లాడేందుకు వ్యతిరేకమని, ఆ వివాహాలు ఆపాలని కోరారు. సర్వేలో పాల్గొన్న వారిలో అతి కొద్ది మంది మాత్రమే తాము మతాంతర వివాహాన్ని చేసుకోవాలని భావిస్తున్నామని వెల్లడించడం గమనార్హం.

ఈ సర్వేలో భాగంగా కులాంతర వివాహాల గురించి కూడా అభిప్రాయాలు సేకరించగా, మతాంతర, కులాంతర వివాహాలపై అభిప్రాయాల మధ్య పెద్దగా తేడా కనిపించలేదు. 62 శాతం మంది పురుషులు, 64 శాతం మంది స్త్రీలు కులాంతర వివాహాలను ఆపడం చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డారు.

More Telugu News