Hyderabad: విధులకు అనుమతించని అధికారులు.. ఆత్మహత్య చేసుకున్న టీఎస్ ఆర్టీసీ డ్రైవర్

  • రాణిగంజ్-1 డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న తిరుపతిరెడ్డి
  • అనుమతి లేకుండా రెండు రోజులు సెలవు పెట్టిన డ్రైవర్ 
  • విధుల్లోకి తీసుకోని డిపో సీఐ విజయ్ కుమార్ 
  • మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య
Ranigunj depot RTC driver Commit suicide

విధులకు అనుమతించకుండా రోజూ తిప్పించుకుంటుండడంతో మనస్తాపానికి గురైన ఓ ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్‌లో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని తుర్కయాంజాల్‌కు చెందిన తిరుపతి రెడ్డి (52) రాణిగంజ్‌-1 డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 12 నుంచి 22 వరకు సిక్‌ లీవ్ తీసుకున్న తిరుపతి 23, 24వ తేదీల్లోనూ విధులకు హాజరుకాలేదు. 25న వెళ్లగా అనుమతి లేకుండా రెండు రోజులు విధులకు హాజరు కానందుకు డిపో సీఐ విజయ్ కుమార్ ఆయనను అనుమతించలేదు. వెళ్లి మేనేజర్‌ను కలవాలని చెప్పారు.

ఏ తప్పు చేయని తాను డీఎం వద్దకు వెళ్లనని తిరుపతిరెడ్డి తెగేసి చెప్పాడు. ఆ రోజు నుంచి రోజూ డిపోకు వెళ్తూ విజయ్‌కుమార్‌ను కలుస్తూనే ఉన్నా విధులకు మాత్రం అనుమతించడం లేదు. నిన్న తెల్లవారుజామున వెళ్లి విజయ్ కుమార్‌ను కలిశారు. మళ్లీ ఆయన నిరాకరించడంతో వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి కిందపడిపోయాడు.

దీంతో తోటి ఉద్యోగులు వెంటనే తిరుపతిరెడ్డిని తొలుత గాంధీకి, ఆపై ఉస్మానియాకు తరలించారు. అయితే, అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. విధులకు అనుమతించకపోవడం వల్లే మనస్తాపానికి గురై తిరుపతిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News