Shiv Sena: మోదీ.. థాకరే మధ్య ఇంకా మంచి సంబంధాలే ఉన్నాయి: శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌

still There is good relationship between modi and thackeray says sanjay Raut
  • మరాఠా రిజర్వేషన్ల కోసమే మోదీ, థాకరే భేటీ
  • ఎంవీఏ ప్రభుత్వం ఐదేళ్లు కొనసాగుతుంది
  • కాంగ్రెస్‌ రహిత ప్రత్యామ్నాయ కూటమి అసాధ్యం
  • కూటమి నేతృత్వం వద్దే సమస్య
శివసేన సీనియర్‌ నేత, ఎంపీ సంజయ్‌ రౌత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. థాకరే కుటుంబానికి, మోదీకి మధ్య ఇంకా మంచి సంబంధాలు కొనసాగుతున్నాయన్నారు. అది రాజకీయాలకు అతీతమైనదన్నారు. అలాగే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ రహిత కూటమి అసాధ్యమన్నారు.

మోదీ, థాకరే మధ్య సంబంధాల గురించి మాట్లాడుతూ.. ‘‘వారిరువురు ఇటీవల 40 నిమిషాల పాటు సమావేశమయ్యారు. దీంతో శివసేన, బీజేపీ మళ్లీ దోస్తీ కడుతున్నాయని అనుమానాలు అవసరం లేదు. మా దారులు వేరు. బీజేపీ ప్రతిపక్షంలో ఉంది. మేం అధికారంలో ఉన్నాం. కానీ, మా మధ్య ఇంకా బలమైన వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి. థాకరే కుటుంబం, మోదీకి మధ్య ఉన్న సంబంధాలు చాలా కాలం నాటివి. రాజకీయాలు వేరు. వ్యక్తిగత సంబంధాలు వేరు. శరద్‌ పవార్‌ కుటుంబంతోనూ ఏళ్లుగా మంచి సంబంధాలు కొనసాగిస్తూ వస్తున్నాం. ఇది మహారాష్ట్ర సంప్రదాయం. మానవ సంబంధాలను పటిష్ఠంగా ఉండేలా చూసుకుంటాం’’ అని సంజయ్‌ రౌత్‌ అన్నారు.

జూన్‌ 8న ప్రధాని మోదీ, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాకరే మధ్య భేటీ జరిగిన విషయం తెలిసిందే. అయితే, వీరిరువురు ఏకాంతంగా దాదాపు 40 నిమిషాలకు పైగా చర్చలు జరపడంతో అనేక ఊహాగానాలు గుప్పుమన్నాయి. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌-ఎన్సీపీ-శివసేన కూటమి ‘మహా వికాస్ ఆఘాడీ(ఎంవీఏ)’ మధ్య విభేదాలు తలెత్తాయన్న చర్చ జరిగింది.

ఈ నేపథ్యంలో శివసేన-బీజేపీ మళ్లీ జట్టుకట్టబోతున్నాయని ముంబయి వర్గాల్లో ఊహాగానాలు వినిపించాయి. తాజాగా సంజయ్‌ రౌత్‌ ఆ వార్తల్ని కొట్టిపారేశారు. మరాఠా రిజర్వేషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో వాటిని ఎలాగైనా సాధించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ సహకారం కోసమే మోదీతో ఉద్ధవ్‌ భేటీ అయ్యారని తెలిపారు. కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య ఐదేళ్ల పాలన కొనసాగించాలన్న ఒప్పందం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఐదేళ్లు ఏంవీఏ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉందని.. అప్పటికి ఎవరు ఒంటరిగా పోటీ చేస్తారన్నది తేలుతుందన్నారు.

మరోవైపు కాంగ్రెస్ లేకుండా జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేస్తే అది సఫలం కాదని సంజయ్‌ రౌత్‌ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ బలహీనంగా ఉన్నప్పటికీ.. దేశవ్యాప్తంగా అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ అదేనని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ను కలుపుకొని.. ఉన్న యూపీఏ కూటమినే బలపరచాల్సిన అవసరం ఉందన్నారు. అయితే, కూటమికి ఎవరు నాయకత్వం వహించాలన్న విషయం దగ్గరే సమస్య వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ విషయంపై శరద్‌ పవార్‌, మమత బెనర్జీ  వంటి వ్యక్తులు కాంగ్రెస్‌ పెద్దలతో చర్చించాలన్నారు. వెంటనే అలాంటి కూటమి అధికారంలోకి రాకపోయినప్పటికీ.. బలమైన ప్రతిపక్షం ఉందన్న ధ్యాస ప్రభుత్వానికి ఉంటుందని వ్యాఖ్యానించారు.
Shiv Sena
Sanjay Raut
BJP
Narendra Modi
Uddhav Thackeray
ncp
sharad Pawar
MVA

More Telugu News