India: పాక్ డ్రోన్ల‌ దాడుల‌కు చెక్ పెట్టేందుకు భార‌త్ ప్ర‌య‌త్నాలు.. యాంటీ డ్రోన్ వ్యవస్థల కొనుగోలు

  • వీలైనంత త్వ‌ర‌గా దేశ వ్యాప్తంగా మిలిట‌రీ స్థావ‌రాల వ‌ద్ద‌ యాంటీ-డ్రోన్ వ్య‌వ‌స్థ‌లు
  • ఇజ్రాయెల్‌తో భార‌త్ చ‌ర్చ‌లు
  • ఇప్ప‌టికే నేవీ ఆర్డ‌ర్లు
  • ఇప్పుడు ఆర్మీ, ఐఏఎఫ్ కూడా కొనుగోలు య‌త్నం
  • అత్య‌వ‌స‌ర కొనుగోళ్ల కింద దిగ‌మ‌తి చేయాల‌ని భార‌త్ యోచ‌న‌?  
India may procure Israeli anti drone systems in wake of Jammu attack

వీలైనంత త్వ‌ర‌గా దేశ వ్యాప్తంగా మిలిట‌రీ స్థావ‌రాల‌ వ‌ద్ద‌ యాంటీ-డ్రోన్ వ్య‌వ‌స్థ‌ల‌ను ఏర్పాటు చేయాల‌ని భార‌త ప్ర‌భుత్వం భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ మేర‌కు త్వ‌ర‌లోనే ఓ కీల‌క‌ నిర్ణ‌యం తీసుకోనుంది.  డ్రోన్ల దాడిని ఎదుర్కొనేందుకు భార‌త్ వ‌ద్ద శక్తిమంతమైన ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ లేక‌పోవ‌డంతో ఇజ్రాయెల్ నుంచి యాంటీ డ్రోన్ సిస్టమ్ స్మాష్ 2000 ప్లస్ ఫైర్ కంట్రోల్ సిస్టమ్స్ ను  పెద్ద ఎత్తున‌ కొనుగోలు చేయాల‌ని భార‌త్ భావిస్తోంది.

ఇప్ప‌టికే భార‌త నౌకాద‌ళం వీటి కోసం ఇజ్రాయెల్ నుంచి వాటిని దిగుమ‌తి చేసుకోవ‌డానికి ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు వాటి సంఖ్య‌ను మ‌రింత పెంచాల‌ని భార‌త ప్ర‌భుత్వం భావిస్తోంది. అత్య‌వ‌స‌ర కొనుగోళ్ల కింద వాటిని దిగుమ‌తి చేసుకునే దిశ‌గా చ‌ర్చ‌లు జ‌రపాల‌ని యోచిస్తోంది. ఈ మేర‌కు త్వ‌ర‌లోనే భార‌త ఆర్మీ, వైమానిక ద‌ళం కూడా  ఇజ్రాయెల్‌తో ఒప్పందం చేసుకునే అవ‌కాశం ఉంది.

ఇజ్రాయెల్ యాంటీ డ్రోన్ సిస్టమ్ స్మాష్ 2000 ప్లస్ ఫైర్ కంట్రోల్ సిస్టమ్స్ కచ్చితంగా డ్రోన్ల‌ను నేలకూల్చగలుగుతుంది. ఈ వ్య‌వ‌స్థ‌లు రాత్రి స‌మ‌యంలోనూ పనిచేస్తాయి. డ్రోన్ల పీచమణచే ఈ వ్య‌వ‌స్థ‌లు గ‌గ‌న‌త‌లంలోని డ్రోన్ల‌తో పాటు ఇత‌ర‌ చిన్న పాటి వ‌స్తువుల‌నూ గుర్తించి, వాటిపై దాడి చేస్తాయి. ఈ వ్య‌వ‌స్థ‌లపై ఏకే-47 లేదా ఇత‌ర రైపిళ్ల‌ను ఉంచి డ్రోన్ల‌పై దాడులు చేయొచ్చు.

కాగా, 2019 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు పాక్‌ నుంచి 300కి పైగా డ్రోన్లు భారత్ భూభాగంలోకి చొచ్చుకొచ్చాయి. మొద‌ట‌ ఆయుధాలు, డ్ర‌గ్స్ వంటివి స‌ర‌ఫ‌రా చేసేందుకు జ‌మ్మూకశ్మీర్‌లోకి పాక్ డ్రోన్ల‌ను పంపింది. తొలిసారి వైమానిక స్థావ‌రంపై దాడి చేయ‌డంతో భ‌విష్య‌త్తులో వాటివ‌ల్ల పొంచి ఉన్న ముప్పును గ్ర‌హించిన భార‌త్ యాంటీ డ్రోన్ వ్య‌వ‌స్థ‌ల‌ను వీలైనంత త్వరగా సమకూర్చుకోవాల‌ని భావిస్తోంది.

ప్ర‌స్తుతం భారత సైనికులు డ్రోన్ల‌ను అత్యాధునిక రైపిళ్ల ద్వారా కాల్చే ప‌ద్ధ‌తిని పాటిస్తున్నారు. అయితే, వాటికి చిక్క‌కుండా డ్రోన్లు సునాయాసంగా త‌ప్పించుకుంటున్నాయి. డ్రోన్ల‌పై ఆటోమెటిక్‌గా దాడి చేసే వ్య‌వ‌స్థ ఉండ‌డం అన్నది ఇప్పుడు భార‌త్‌కు అత్యవసరం.

More Telugu News