Supreme Court: ‘ఒకే దేశం.. ఒకే రేషన్​ కార్డు’ను అన్ని రాష్ట్రాలూ అమలు చేయాల్సిందే: సుప్రీంకోర్టు

States Must Implement One Nation One Ration Scheme By July 31 Orders Supreme Court
  • జులై 31 వరకు గడువు
  • కరోనా ఉన్నంతకాలం వలస కార్మికులకు ఫ్రీ రేషన్ ఇవ్వాలి
  • కార్మికుల నమోదుకు కేంద్రం పోర్టల్ ఏర్పాటు చేయాలి
అన్ని రాష్ట్రాలూ ‘ఒకే దేశం.. ఒకే రేషన్ కార్డు’ పథకాన్ని అమలు చేయాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. జులై 31లోగా పథకాన్ని ప్రారంభించాలని ఆదేశాలిచ్చింది. వలస కార్మికులు ఎక్కడైనా రేషన్ తీసుకునేందుకు పేర్లను నమోదు చేసుకునేలా ఓ పోర్టల్ ను ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ పథకంతో వలస కార్మికులు తాము పనిచేసే చోటే రేషన్ ను తీసుకునే వీలు కలుగుతుందని చెప్పింది.

అంజలి భరద్వాజ్, హర్ష్ మందర్, జగ్ దీప్ ఛొకర్ లు వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎంఆర్ షాల ధర్మాసనం ఇవాళ విచారణ చేసింది. కరోనాతో ఆర్థికంగా బాగా చితికిపోయిన వలస కార్మికుల సంక్షేమంపై కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలకు పలు ఆదేశాలు ఇచ్చింది. మహమ్మారి ఉన్నన్నాళ్లూ వలస కార్మికులకు ఉచితంగా రేషన్ సరుకులు ఇవ్వాలని, కమ్యూనిటీ కిచెన్ సెంటర్లను కొనసాగించాలని రాష్ట్రాలను ఆదేశించింది. అందుకు కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాలకు ఆహార ధాన్యాలను కేటాయించాలని ఆదేశాలిచ్చింది.

అసంఘటిత రంగ కార్మికులతో జాతీయ డేటాబేస్ రూపకల్పనలో కీలకమైన సాఫ్ట్ వేర్ అభివృద్ధి ఆలస్యమవడాన్ని పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. జులై 31లోగా సాఫ్ట్ వేర్ ను అభివృద్ధి చేసి డేటాబేస్ ను ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించింది. అందుకు నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ సహకారం తీసుకోవాలని సూచించింది. కార్మికుల నమోదు కోసం రాష్ట్రాలూ కాంట్రాక్టర్లందరి వివరాలనూ వీలైనంత త్వరగా నమోదు చేయాలని సూచనలిచ్చింది.
Supreme Court
COVID19
One Nation One Ration

More Telugu News