Revanth Reddy: రాష్ట్ర ప్ర‌భుత్వం క‌ట్టాల్సిన ప్రాప‌ర్టీ ట్యాక్స్ క‌ట్ట‌ట్లేదు... ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు నీళ్లు, విద్యుత్ ఆపేయాలి: రేవంత్ రెడ్డి

  • అన్ని ర‌కాల ప‌న్నులు పెంచారు
  • ప్ర‌భుత్వం మాత్రం క‌నీసం స‌ర్కారు బంగ్లాల ప‌న్నులు చెల్లించ‌డంలేదు
  • ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు కూడా రూపాయి ప‌న్ను క‌ట్టలేదు
  • ప్ర‌భుత్వం 2,600 కోట్ల రూపాయ‌ల ప‌న్నులు క‌ట్టాలి
revanth reddy slams trs

తెలంగాణ రాష్ట్ర నూతన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి జులై 7న బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్న నేప‌థ్యంలో వ‌రుస‌గా త‌మ పార్టీ సీనియర్ నేతలతో స‌మావేశ‌మ‌వుతున్నారు. ఇప్ప‌టికే ప‌లువురు నేత‌ల‌ను క‌లిసిన రేవంత్ ఈ రోజు హైద‌రాబాద్‌లో మీడియా స‌మావేశంలో మాట్లాడారు.

హైద‌రాబాద్ న‌గ‌రాన్ని ప‌రిశుభ్రంగా ఉంచితేనే ఫ‌లితం ఉంటుంద‌ని రేవంత్ రెడ్డి చెప్పారు. రూ.800 కోట్ల‌తో వ‌ర‌ద నివార‌ణ చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌ని ఇచ్చిన హామీని నిల‌బెట్టుకోలేదని అన్నారు. అంతేగాక‌. అన్ని ర‌కాల ప‌న్నులు పెంచారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌జ‌ల నుంచి ప‌న్నులు వ‌సూలు చేస్తున్నారు కానీ, జీహెచ్ఎంసీకి ప్ర‌భుత్వం చెల్లించాల్సిన ప‌న్నులు మాత్రం చెల్లించ‌డం లేద‌ని చెప్పారు.

'ప్ర‌భుత్వం అభివృద్ధి ప‌నుల‌కు నిధులు ఇచ్చే విష‌యం దేవుడెరుగు. క‌నీసం ప్ర‌భుత్వ బంగ్లాల ప‌న్నులు చెల్లించ‌డంలేదు, రాష్ట్ర ప్ర‌భుత్వం క‌ట్టాల్సిన ప్రాప‌ర్టీ ట్యాక్స్ కూడా క‌ట్ట‌ట్లేదు. జీహెచ్ఎంసీలో అతిపెద్ద ప‌న్ను ఎగ‌వేత‌దారుడు కేసీఆర్.. రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు కూడా రూపాయి ప‌న్ను క‌ట్టలేదు' అని రేవంత్ రెడ్డి విమర్శించారు.

'ఆ భ‌వ‌న్‌కు నీళ్లు, విద్యుత్ ఆపేయాలి. నేను జీహెచ్ఎంసీ మేయ‌ర్‌కు ఒకటే విజ్ఞ‌ప్తి చేస్తున్నాను. నాకున్న స‌మాచారం మేర‌కు ప్ర‌భుత్వం 2,600 కోట్ల రూపాయ‌ల ప‌న్నులు క‌ట్టాలి. ఆ పన్నులు రాబ‌ట్టితే జీహెచ్ఎంసీ అప్పులు చేయాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. జీహెచ్ఎంసీకి రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌న్నులు చెల్లించ‌డం లేదు. హైద‌రాబాద్ న‌గ‌రం తెలంగాణ గుండె. ఇక్క‌డి నాలాలు, చెరువులు క‌బ్జాకు గురి కాకుండా సీసీ కెమెరాలు పెట్టాలి. కానీ, మాఫియాకు మ‌ద్ద‌తుగా ఉండేందుకే ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పెట్ట‌ట్లేదు. త్వ‌ర‌లో మూసీ ప‌రీవాహ‌క ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తాను' అని రేవంత్ రెడ్డి చెప్పారు.

కాగా, జులై 7న ఉదయం 10 గంటలకు పెద్దమ్మ గుడిలో పూజలు చేయ‌నున్న రేవంత్ రెడ్డి అనంత‌రం నాంపల్లిలోని మసీదులోనూ ప్రార్థ‌న‌లు చేసి గాంధీభవన్‌లో బాధ్యతలు తీసుకుంటారని ఇప్ప‌టికే ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. ఆ లోపు పార్టీ సీనియ‌ర్ నేత‌లందరి మ‌ద్ద‌తును కూడ‌గ‌ట్టేందుకు రేవంత్ రెడ్డి ప్ర‌య‌త్నాలు జ‌రుపుతున్నారు.

More Telugu News