Mumbai: ముంబయి పిల్లల్లో 50 శాతం మందికి కరోనా యాంటీబాడీలు: తాజా సర్వేలో వెల్లడి

  • మూడో వేవ్‌ ముప్పు ఆందోళనల నుంచి ఉపశమనం
  • సీరో సర్వేలో 51.18 శాతం సీరోపాజిటివిటీ
  • 6-18 ఏళ్ల వారిపై సర్వే
  • 10-14 ఏళ్ల వయసు వారిలో అధిక సీరోపాజిటివిటీ
50 pc seropositivity in Mumbai children

ముంబయిలో జరిపిన సీరో సర్వే ఆసక్తికర విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. నగరంలో దాదాపు 50 శాతం మంది పిల్లల్లో కరోనా యాంటీబాడీలు ఉన్నట్లు తేలింది. బృహత్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌(బీఎంసీ) పరిధిలో కొన్ని ప్రాంతాల్లో బీవైఎల్‌ నాయర్‌ ఆసుపత్రి, కస్తూర్బా మాలిక్యులార్‌ డయోగ్నోస్టిక్‌ ల్యాబ్‌ సంయుక్తంగా సర్వే నిర్వహించాయి. ఈ స్థాయిలో సీరోపాజిటివిటీ నేపథ్యంలో మూడో వేవ్ ముప్పుపై ఉన్న ఆందోళనల నుంచి కాస్త ఉపశమనం లభిస్తోంది. ఇప్పటికే 50 శాతం మందిలో యాంటీబాడీలు ఉన్న నేపథ్యంలో మూడో వేవ్‌ విజృంభించే అవకాశాలు తక్కువేనని అధికారులు భావిస్తున్నారు.

ముంబయిలో మొత్తం 24 వార్డుల్లో సర్వే చేశారు. ఆరు నుంచి 18 ఏళ్ల మధ్య వయసుగల పిల్లల్లో మొత్తం 10 వేల నమూనాలను సేకరించారు. ఈ వర్గంలో మొత్తం 51.18 శాతం సీరో పాజిటివిటీ ఉన్నట్లు గుర్తించారు. అత్యధికంగా 10-14 ఏళ్ల మధ్య వయసుగల వారిలో  53.43 శాతం సీరోపాజిటివిటీ ఉన్నట్లు కనుగొన్నారు. ఇక 1-4 ఏళ్ల వారిలో 51.04 శాతం, 5-9 ఏళ్ల వారిలో 47.33 శాతం, 10-14 ఏళ్ల వారిలో 53.43 శాతం, 15-18 ఏళ్ల వారిలో 51.39 శాతం సీరోపాజిటివిటీ  ఉన్నట్లు బీఎంసీ ప్రకటించింది.

మార్చిలో నిర్వహించిన సర్వేతో పోలిస్తే ప్రస్తుతం పిల్లల్లో సీరోపాజిటివిటీ పెరిగినట్లు తెలిపింది. గతంలో నిర్వహించిన సర్వేలో 39.4 శాతం మందిలో సీరోపాజిటివిటీ ఉన్నట్లు గుర్తించారు.

More Telugu News