Ramachandraiah: హుజూరాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలోనే తెలంగాణ నేతలు ప్రాజెక్టులపై అలజడి రేపుతున్నారు: సి.రామచంద్రయ్య

  • ఏపీ, తెలంగాణ మధ్య జలయుద్ధం
  • ఇరు రాష్ట్రాల నేతల మధ్య విమర్శల దాడులు
  • తాజాగా ఏపీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య స్పందన
  • తెలంగాణ నేతలు అవగాహనలేమితో మాట్లాడుతున్నారని వెల్లడి
Ramachandraiah comments on projects issue

ఏపీ నీటి పారుదల ప్రాజెక్టులను తెలంగాణ తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తుండడం తెలిసిందే. నిత్యం ఏపీ నేతలు, తెలంగాణ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య స్పందించారు. హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ ను ఎలాగైనా ఓడించాలని భావిస్తూ ప్రాజెక్టులపై అలజడి సృష్టిస్తున్నారని ఆరోపించారు. ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, ఈ క్రమంలో తెలంగాణ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.

మహానేత వైఎస్సార్ పై అనవసరంగా నోరు పారేసుకుంటున్నారని మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టులను రూపకల్పన చేసిన మహానాయకుడు వైఎస్సార్ అని రామచంద్రయ్య కీర్తించారు. ఏళ్ల తరబడి పునాది రాళ్లకే పరిమితమైన పోలవరంతో పాటు, నేడు కాళేశ్వరం ప్రాజెక్టుగా పరిగణిస్తున్న  ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులకు అంకురార్పణ చేసింది వైఎస్సారేనని వెల్లడించారు. అలాంటి వ్యక్తిని తెలంగాణ ద్రోహి అంటారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని కోరుకున్న వ్యక్తి వైఎస్సార్ అని, చరిత్ర మీకు ఏం తెలుసు? అంటూ నిలదీశారు.

"రాయలసీమకు అన్యాయం జరిగిందని గతంలో కేసీఆర్ అన్నది నిజం కాదా? కృష్ణా జలాల్లో బచావత్ అవార్డు ప్రకారం రాయలసీమకు సామాజిక న్యాయం జరగలేదు. వర్షపాతం తక్కువ, వెనుకబాటుతనం ఎక్కువగా ఉన్న రాయలసీమకు 122.70 టీఎంసీల నీటినే ఇచ్చారు. సామాజిక న్యాయం జరగాలంటే వాస్తవానికి ఇంకా ఎక్కువ నీళ్లు ఇవ్వాలి. ఈ అసమానతను సరిచేసేందుకే వైఎస్సార్ జలయజ్ఞం పేరిట ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు.

ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు అతి పెద్ద లిఫ్ట ఇరిగేషన్ ప్రాజెక్టుగా చెబుతున్నారు... దానికి అంకుర్పారణ చేసింది ఎవరో తెలంగాణ నేతలు చెప్పాలి. పోతిరెడ్డిపాడుపైనా రాద్ధాంతం చేస్తున్నారు. 2008లో పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని వైఎస్సార్ 44,000 క్యూసెక్కులకు పెంచారు. అఖిలపక్షం కూడా ఆమోదం తెలిపింది. రాష్ట్రానికి కేటాయించిన మేరకే నీటిని వాడుకుంటున్నాం. ఇది ఏ విధంగా తప్పు అవుతుంది?

రాయలసీమ, నెల్లూరు ప్రాంతాలకు నీరు అందించాలంటే లిఫ్ట్ విధానం తప్పనిసరి. అందుకే సీఎం జగన్ ప్రాజెక్టును ముందుకు తీసుకెళుతున్నారు. అపెక్స్ కౌన్సిల్ లో చెప్పిందే చేస్తున్నాం. ఇక్కడ తెలంగాణకు ఏ విధంగా నష్టం జరిగినట్టు? తెలంగాణలోని పాలమూరు, కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టుల సామర్థ్యం పెంచుకున్నారు.

ఆర్డీఎస్ కు సంబంధించిన 4 టీఎంసీల నీటి కేటాయింపులు ఉంటే దాన్నే ఏపీ వాడుకుంటోంది. మరి ఏపీ ప్రభుత్వం ఎక్కడ అక్రమ ప్రాజెక్టులు చేపడుతోంది?" అంటూ రామచంద్రయ్య ప్రశ్నించారు.

హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలోనే తెలంగాణ నేతలు ప్రాజెక్టులపై కలకలం రేపుతున్నారని ఆరోపించారు. ఈటలను ఓడించేందుకు ప్రజలను ఈ విధంగా రెచ్చగొడుతున్నారని, దీనివల్ల సానుకూల ఫలితం ఎట్టి పరిస్థితుల్లోనూ రాదని స్పష్టం చేశారు.

More Telugu News