Andhra Pradesh: రుయా ఘటనకు బాధ్యులెవరో తేలాల్సిందే!: ఏపీ హైకోర్టు

  • ఎవరి నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు పోయాయి?
  • కౌంటర్ దాఖలు చేయాలని సర్కార్ కు ఆదేశం
  • కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదన్న పిటిషనర్
  • కేసును దర్యాప్తు చేయాల్సిందేనన్న కోర్టు
AP High Court Asks Govt To File Affidavit Over RUIA Incident

తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనకు సంబంధించి ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటనకు కారకులెవరో, ఎవరి నిర్లక్ష్యం వల్ల అంతమంది ప్రాణాలు పోయాయో నిగ్గు తేల్చాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దానిపై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వం, పోలీసులు, ఆసుపత్రి అధికారులకు ఆదేశాలను ఇచ్చింది.

రుయా ఆసుపత్రిలో అరగంట పాటు ఆక్సిజన్ సరఫరాకు అంతరాయం ఏర్పడిన ఘటనలో 11 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. దీనిపై హైకోర్టులో మే 20న టీడీపీ నేత పి.ఆర్. మోహన్ పిటిషన్ వేశారు. 36 మంది చనిపోతే కేవలం 11 మందే చనిపోయారని ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని అందులో పేర్కొన్నారు. ఆ వ్యాజ్యాన్ని కోర్టు ఇవ్వాళ విచారించింది. ప్రభుత్వం, ఆసుపత్రి అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రజల ప్రాణాలు పోయాయని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

ఈ కేసుకు సంబంధించి ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఎంత మంది చనిపోయారో కూడా ఇప్పటికీ స్పష్టత లేదన్నారు. పరిహారం ఇచ్చే విషయంలోనూ ప్రభుత్వం వ్యత్యాసాలు చూపించిందని ఆరోపించారు. ఎల్జీ పాలిమర్స్ ఘటనలో బాధిత కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇచ్చిన సర్కారు.. రుయా బాధితులకు మాత్రం రూ.10 లక్షలే ఇచ్చిందని పేర్కొన్నారు.

రుయా ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును దర్యాప్తు చేయించాలని కోర్టును కోరారు. న్యాయవాది చెప్పిన దానితో ఏకీభవించిన కోర్టు.. ఘటనపై దర్యాప్తు జరగాల్సిందేనని పేర్కొంది. కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించిన కోర్టు విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

More Telugu News