Telangana: కాకతీయ యూనివర్సిటీలో ‘పీవీ విద్యా పీఠం’ ఏర్పాటు: సీఎం కేసీఆర్​

  • పీవీ శత జయంతి ఉత్సవ ముగింపు సభలో వెల్లడి
  • నవోదయ, గురుకులాలు ఆయన చలవే
  • పీవీ నిరంతర సంస్కరణశీలి
  • ఆయన భూసంస్కరణలు వేరే వారికి సాధ్యం కాదు
  • ఆర్థిక సంస్కరణలతో నేడు అందరికీ ప్రయోజనం
KCR Announces PV Chair in Kakatiya University

మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు గొప్ప సంస్కరణ శీలి అని సీఎం కేసీఆర్ కొనియాడారు. పీవీ శతజయంతి ఉత్సవ ముగింపు సభలో ఆయన మాట్లాడారు. పీవీ పుస్తకాల సంకలనాలను గవర్నర్ తమిళిసై ఆవిష్కరించారు. అంతకుముందు పీవీ విగ్రహాన్ని గవర్నర్ తమిళిసైతో కలిసి ఆవిష్కరించారు.

పీవీ జీవితం అందరికీ ఆదర్శమని కేసీఆర్ అన్నారు. ఎక్కడ ఏ పాత్ర లభించినా.. అక్కడ సంస్కరణలను తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఆయన చిరస్మరణీయులని, రాబోయే తరాలూ గుర్తుంచుకునేలా కాకతీయ యూనివర్సిటీలో ‘పీవీ విద్యా పీఠం’ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. ఇప్పటికే కేయూ వీసీ పంపించిన ప్రతిపాదనలను ఆమోదిస్తున్నట్టు తెలిపారు.

విద్యాశాఖ మంత్రిగా నవోదయ పాఠశాలలు, గురుకుల విద్యాలయాలు ఏర్పాటు చేసిన ఘనత పీవీదేనని, వాటికి ఆద్యులే ఆయన అని అన్నారు. పీవీ విద్యానిధి, సాహిత్య పెన్నిధి అని అన్నారు. సమయానుకూల నిర్ణయాలను తీసుకోవడంలో పీవీ ముందుంటున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర స్థాయుల్లో ఆయన అలాంటి నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు.

ఆయన చేపట్టిన భూ సంస్కరణలు వేరే వారి వల్ల అయ్యేది కాదని అన్నారు. అప్పుడున్న సమస్యలకు అలాంటి భూ సంస్కరణలు చేపట్టడం చాలా కష్టమన్నారు. ఆ విషయంలో వేరే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకూ ఆదర్శప్రాయంగా నిలిచారని కొనియాడారు. ఆ సమయంలో తన 800 ఎకరాల భూములను తృణ ప్రాయంగా పేదలకు పంచేశారని కేసీఆర్ గుర్తు చేశారు. అది మామూలు విషయం కాదన్నారు.

రాజకీయాల నుంచి విరమించుకుంటున్న తరుణంలోనే తప్పనిసరి పరిస్థితుల్లో ప్రధానిగా పీవీ బాధ్యతలు చేపట్టారని గుర్తు చేశారు. మైనారిటీ ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపించారని, ఎన్నెన్నో ఆర్థిక సంస్కరణలను తీసుకొచ్చారని సీఎం కేసీఆర్ కొనియాడారు. ఈరోజు దేశానికి కార్పొరేట్ కంపెనీలు రావడానికి, యువతకు విరివిగా ఉద్యోగాలు అందడానికి, రాష్ట్రాల బడ్జెట్ లక్షల కోట్లకు పెరగడానికి కారణం ఆయన ఆర్థిక సంస్కరణలేనని ప్రశంసలు కురిపించారు. పీవీ శతజయంతి ఉత్సవాలను చాలా గొప్పగా నిర్వహించారని కె. కేశవరావును ఆయన అభినందించారు.

కాగా, పీవీ శతజయంతి ఓ గొప్ప పండుగ అని గవర్నర్ తమిళిసై అన్నారు. పీవీ విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. ఆయన చేసిన రచనలను నేటి తరానికి గుర్తు చేసేలా సంకలనాలను అందుబాటులోకి తీసుకురావడం చాలా మంచి ఆలోచన అని కొనియాడారు. రాజకీయాలకు అతీతంగా పీవీ గౌరవించదగిన వ్యక్తి అని కలాం చెబుతూ ఉండేవారని తమిళిసై గుర్తు చేశారు.

More Telugu News