pv: పీవీ నరసింహారావు శత జయంతి వేళ ప్ర‌ముఖుల నివాళులు

  • పీవీ రాజనీతిజ్ఞుడు, క్రాంతదర్శి: ఉపరాష్ట్రప‌తి  
  • పీవీ చేసిన సేవలు చిరస్మరణీయం: ప్ర‌ధాని  
  • తెలంగాణ నేల సృష్టించిన అద్భుత మేధస్సు పీవీ: హ‌రీశ్
  • పీవీ తెలంగాణ ముద్దు బిడ్డ: కేటీఆర్
 venkaiah modi mourns on pv birth anniversary

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి సందర్భంగా ప‌లువురు ప్ర‌ముఖులు నివాళులు అర్పించారు. 'భారత మాజీ ప్రధానమంత్రి, రాజనీతిజ్ఞుడు, క్రాంతదర్శి, విప్లవాత్మక ఆర్థిక సంస్కరణల మార్గదర్శి శ్రీ పాములపర్తి వేంకట నరసింహారావు జయంతి సందర్భంగా ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను' అని ఉప రాష్ట్రప‌తి వెంక‌య్యనాయుడు ట్వీట్ చేశారు.
 
'స్వావలంబన, స్వయం సమృద్ధికి పెద్దపీట వేస్తూ దేశ భవిష్యత్తుకు బాటలు పరచిన పీవీ, మాతృభాషకు సైతం అంతే ప్రాధాన్యతనిచ్చారు. విశాల దృష్టితో వీక్షించి, దేశానికి వారు అందించిన సేవలను జాతి యావత్తు చిరకాలం గుర్తు పెట్టుకుంటుంది' అని ఆయ‌న అన్నారు.

దేశానికి పీవీ చేసిన సేవలు చిరస్మరణీయమ‌ని ప్ర‌ధాని మోదీ అన్నారు. అసాధారణమైన ప్రతిభ, జ్ఞానం పీవీ సొంతమ‌ని పేర్కొన్నారు. దేశ అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి ఎనలేనిదని తెలిపారు. పీవీ నరసింహారావు శత జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నట్లు చెప్పారు.

తెలంగాణ నేల సృష్టించిన అద్భుత మేధస్సు పీవీ నరసింహారావు గారంటూ తెలంగాణ మంత్రి హ‌రీశ్ రావు ట్వీట్ చేశారు. 'ఆలోచనాపరునిగా, సాహితీ వేత్తగా, బహు భాషా కోవిదునిగా, పరిపాలనా దక్షుడిగా, రాజనీతిజ్ఞుడిగా ఆయన చూపిన ప్రజ్ఞ అమోఘం, అనితర సాధ్యం. ఆర్థిక సంస్కరణలతో ఆధునిక భారత దేశానికి శ్రీకారం చుట్టిన ఘనత ఆయనదే. ఆ మహానీయుని శతజయంతి సందర్భంగా తెలంగాణ ఠీవీ.. మన పీవీని ఘనంగా స్మరించుకుందాం. ఘన నివాళులు అర్పిద్దాం' అని పేర్కొన్నారు.

'ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి పథంలో నిలిపిన దార్శనికుడు, బహుభాషా కోవిదులు, తెలంగాణ ముద్దు బిడ్డ, మాజీ ప్రధాని శ్రీ పి.వి. నరసింహారావు గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళి' అని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ పోస్టు చేశారు.

'ఆర్థిక సంస్కరణలతో దేశ సమగ్రాభివృద్ధికి బాటలు వేసి, పారిశ్రామిక రంగంలో, పల్లెల‌ స్థితిగతుల్లో సమూలంగా మార్పులు తెచ్చిన గొప్ప వ్యక్తి తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని మన పీవీ నరసింహారావు. వారి సేవలను స్మరిస్తూ, శతజయంతి సందర్భంగా తెలంగాణ ముద్దు బిడ్డ పీవీ నరసింహారావు గారికి ఘన నివాళులు' అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత పేర్కొన్నారు.

More Telugu News