బస్టాప్ లో కనిపించిన బ్రిటన్ సైనిక రహస్య పత్రాలు!

28-06-2021 Mon 09:15
  • ఓ యువకుడి చేతికి చిక్కిన పత్రాలు
  • వార్ షిప్ ల సమాచారం, ఈ-మెయిల్స్
  • రష్యాపైనా కీలక చర్చల సమాచారం
Britain Army Files at Bus Stop
  బ్రిటన్ సైనిక రహస్యాలకు చెందిన కీలకమైన పత్రాలు కెంట్ కౌంటీలో ఉన్న ఓ బస్టాప్ వద్ద కనిపించాయని బీబీసీ మీడియా ఓ ప్రత్యేక కథనంలో వెల్లడించింది. ఓ పౌరుడికి ఇవి గత మంగళవారం కనిపించాయని పేర్కొంది. ఇందులో బ్రిటన్ మిలటరీతో పాటు, వార్ షిప్ లకు సంబంధించిన సమాచారం ఉందని పేర్కొంది. వీటితో పాటు రక్షణ శాఖ ఉన్నతాధికారుల ఈ-మెయిల్స్ తో పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఉన్నాయని తెలిపింది.

 కాగా, తమ కార్యాలయంలోని కొన్ని ముఖ్యమైన దస్త్రాలు మాయం అయ్యాయని గత వారం రక్షణ శాఖకు చెందిన ఓ ఉద్యోగి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో, అవి ఇవేనని భావిస్తున్నారు. క్రిమియా సముద్ర జలాల్లోకి తమ యుద్ధనౌక 'హెచ్ఎంఎస్ డిఫెండర్'ను పంపిస్తే, రష్యా ఎలా స్పందిస్తుందన్న విషయమై అధికారుల మధ్య జరిగిన చర్చకు సంబంధించిన వివరాలు ఇందులో ఉన్నాయి.

ఇదే సమయంలో రష్యా దూకుడుతనాన్ని ప్రదర్శిస్తే, ఎదుర్కొనేందుకు అవసరమైన చాపర్ ను, ఆయుధాలను నౌకలోని హ్యాంగర్ లో సిద్ధంగా ఉంచామని కూడా ఉంది. ఆఫ్గన్ నుంచి నాటో దళాల ఉపసంహరణ పూర్తయిన తరువాత, బ్రిటన్ సైనికులను వెనక్కు రప్పించడంపై వేసిన ప్రణాళికల అంశం కూడా ఈ పత్రాల్లో కనిపించింది.

కాగా, గత బుధవారం నాడు బ్రిటన్ వార్ షిప్, తమ అధీనంలో ఉన్న సముద్ర జలాల్లోకి వచ్చిందని, వెంటనే తమ విమానాలు, నౌకలు దాన్ని వెంబడించాయని, ఈ సందర్భంగా కాల్పులు కూడా జరపాల్సి వచ్చిందని రష్యా ప్రకటించిన సంగతి విదితమే.