Afghanistan: రక్తమోడుతున్న ఆఫ్ఘనిస్థాన్.. తాలిబన్ల నియంత్రణలో పలు జిల్లాలు

  • అమెరికా సైన్యం ఉపసంహరణ తర్వాత చెలరేగిపోతున్న తాలిబన్లు
  • పాఠశాల విద్యార్థుల నుంచి మహిళల వరకు అందరిపైనా దాడులు
  • పెద్ద ఎత్తున మరణిస్తున్న సైన్యం
  • పోరాడలేక స్థావరాలు అప్పగిస్తున్న భద్రతా దళాలు
Several districts under Taliban control

ఆప్ఘనిస్థాన్‌లో అమెరికా సైనికుల ఉపసంహరణ తర్వాత తాలిబన్లు మళ్లీ చెలరేగిపోతున్నారు. భీకరదాడులతో విరుచుకుపడుతూ రక్తపాతం సృష్టిస్తున్నారు. దేశాన్ని చేజిక్కించుకునే దిశగా వేగంగా ముందుకు కదులుతున్నారు. ఆఫ్ఘన్ సైనికుల బలహీనతను సొమ్ము చేసుకుంటున్న తాలిబన్లు గతంలో తమ అధీనంలో ఉన్న ప్రాంతాలను తిరిగి నియంత్రణలోకి తెచ్చుకుంటున్నారు.

 మే 1వ తేదీకి ముందు 387 జిల్లాల్లో 73 జిల్లాలు వారి నియంత్రణలో ఉండేవి. గత రెండు నెలల కాలంలో మరో 17 ప్రావిన్సులలోని 30 జిల్లాలను నియంత్రణలోకి తెచ్చుకున్నారు. అంతేకాదు రాజధాని కాబూల్‌కు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుందూజ్ ప్రాంతాన్ని కూడా తమ గుప్పిట్లోకి తెచ్చుకోవడం కలవరపెడుతోంది.

ఆఫ్ఘన్ నుంచి అమెరికా, దాని మిత్రదేశాల దళాల ఉపసంహరణ మొదలైన తర్వాత తాలిబన్లు వికృతంగా విరుచుకుపడుతున్నారు. సాధారణ పౌరులు, పాత్రికేయులు, మహిళా కార్యకర్తలు, మానవహక్కుల పరిరక్షణ కార్యకర్తలపై తాలిబన్ల దాడులు పెరిగాయి. మరీ ముఖ్యంగా విద్యార్థులు, యువతులపై వారి దాడులు పెచ్చుమీరాయి. ఏప్రిల్‌తో పోలిస్తే మేలో తీవ్రవాద సంబంధిత మరణాలు రెండున్నర రెట్లు పెరిగినట్టు నివేదికలు చెబుతున్నాయి.

ఏప్రిల్‌లో 1654 మంది తీవ్రవాద ఘటనల్లో చనిపోతే మేలో ఈ సంఖ్య 4,375కు పెరిగింది. తీవ్రవాద దాడుల వల్ల సైనికులు కూడా పెద్ద ఎత్తున మరణిస్తున్నారు. ఏప్రిల్‌లో 388 మంది సైనికులు చనిపోతే మే నెలలో ఏకంగా 1,134 మంది ప్రాణాలు కోల్పోయారు. తాలిబన్లను అడ్డుకునే శక్తిసామర్థ్యాలు లేని ఆఫ్ఘనిస్థాన్ జాతీయ భద్రత, రక్షణ దళాలు మే నెలలో 26 స్థావరాలను తాలిబన్లకు అప్పగించడం గమనార్హం.

More Telugu News