Raj Nath Singh: నేడు ఎల్ఏసీ వద్దకు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్!

  • సరిహద్దుల్లో మూడు రోజుల పర్యటన
  • నేడు కొత్త వంతెనను ప్రారంభించనున్న రాజ్ నాథ్
  • భారీ భద్రతా ఏర్పాట్లు చేసిన ఆర్మీ
Raj Nath Singh Tour near LAC Today

రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, నేడు లడఖ్ ప్రాంతంలో పర్యటించనున్నారు. ఇదే సమయంలో వాస్తవాధీన రేఖ వద్ద నెలకొన్న పరిస్థితులపై సమీక్షను నిర్వహించడంతో పాటు, బీఆర్ఓ నిర్మించిన కొత్త వంతెనను ఆయన ప్రారంభించనున్నారు. శనివారమే ఇందుకు ఏర్పాట్లు పూర్తికాగా, ఎల్ఏసీ వద్ద భద్రతాంశాలను అధికారులు ఆయనకు వివరించారు. తూర్పు లడఖ్ ప్రాంతంలో చైనా కార్యకలాపాలు ఇటీవల పెరిగిన నేపథ్యంలో రాజ్ నాథ్ పర్యటనకు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

మూడు రోజుల పర్యటన కోసం వచ్చిన రాజ్ నాథ్ ప్రస్తుతం లేహ్ ప్రాంతంలో ఉన్నారు. కార్గిల్ పరిధిలో ఉన్న ఎల్ఏహెచ్డీసీ (లడక్ అటానమస్ హిల్ డెవలప్ మెంట్ కౌన్సిల్) ప్రతినిధులను ఆయన కలుసుకుని, వివిధ అంశాలపై చర్చలు జరిపారు. నిన్న ఆయన లేహ్ పరిధిలో ఉంటున్న మాజీ ఆర్మీ ఉద్యోగులతోనూ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్మీలో పనిచేసి పదవీ విరమణ చేసిన వారికి అన్ని రకాల సౌకర్యాలను కల్పించాలని ప్రధాని మోదీ ఇప్పటికే నిర్ణయించారని తెలిపారు.

త్వరలోనే వన్ ర్యాంక్ - వన్ పెన్షన్ విధానాన్ని అమలులోకి తీసుకుని వస్తామని హామీ ఇచ్చారు. ఇక రాజ్ నాథ్ సింగ్, నేడు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నిర్మించిన ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. ఆపై ఈ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న భద్రతా దళాలతో ఆయన సమావేశం కానున్నారు.

More Telugu News