ఆ పదివేల పావురాలు ఏమయ్యాయి?

27-06-2021 Sun 20:17
  • బ్రిటన్ లో పావురాల రేసు
  • పీటర్ బరో నుంచి గాల్లోకి ఎగసిన వేలాది పావురాలు
  • ఇప్పటివరకు తిరిగిరాని వైనం
  • ఆందోళనలో యజమానులు, రేసు నిర్వాహకులు
Ten thousand pigeons missing in Britain
ప్రపంచవ్యాప్తంగా పావురాల రేసులు నిర్వహించడం తెలిసిందే. ఇది చాలా ఖరీదైన వ్యవహారం. దీనిపై బెట్టింగుల విలువ కోట్లల్లో ఉంటుందని సమాచారం. అయితే, బ్రిటన్ లో ఓ పావురాల రేసు సందర్భంగా అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. రేసు కోసం గాల్లోకి ఎగిరిన 10 వేల పావురాలు ఉన్నట్టుండి అదృశ్యం అయ్యాయి.

శనివారం బ్రిటన్ లోని పీటర్ బరోలో 270 కిమీ పావురాల రేసు జరిగింది. సాధారణ పరిస్థితుల్లో గాల్లోకి ఎగిసిన పావురాలు నిర్దేశిత దూరాన్ని చేరుకుని, తిరిగి తమ యజమానుల చెంతకు చేరాల్సి ఉంటుంది. కానీ, ఈ పదివేల పావురాలు ఆచూకీ లేకుండా పోవడం వాటి యజమానులను, రేసు నిర్వాహకులను ఆందోళనకు గురిచేస్తోంది.

కాగా, బ్రిటన్ లో ఎక్కడిక్కడ తుపాను పరిస్థితులు సంభవిస్తుంటాయని, వాటి కారణంగానే పావురాలు దారితప్పి ఉంటాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తమ పావురాలను ఎవరైనా గుర్తిస్తే వాటికి నీరు, ఆహారం అందించాలని వాటి యజమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.

రేసుల్లో పాల్గొనే పావురాలు కాళ్లకు వేర్వేరు రంగులతో ఉండే రింగులు ధరించి ప్రత్యేకంగా కనిపిస్తుంటాయి. వీటిని గుర్తించడం తేలికే. ఇవి మామూలు పావురాలతో పోల్చితే ఎంతో దృఢంగా ఉంటాయి.