Imran Khan: లాడెన్ ను అమరవీరుడిగా పేర్కొన్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్... వివరణ ఇచ్చిన మంత్రి

  • 2011లో లాడెన్ హతం
  • గతేడాది జూన్ లో పార్లమెంటులో ప్రసంగించిన ఇమ్రాన్
  • లాడెన్ ను అమెరికా చంపేసిందని వెల్లడి
  • వీడియో తాజాగా వైరల్ అవుతున్న వైనం
Pakistan minister Fawad Choudhry advocates for PM Modi

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు వివాదాలు కొత్త కాదు. అల్ ఖైదా వ్యవస్థాపకుడు, కరడుగట్టిన అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ ను అమరవీరుడిగా ఇమ్రాన్ ఖాన్ పేర్కొనడంపై పాక్ మంత్రి ఫవాద్ చౌదరి వివరణ ఇచ్చారు. గతేడాది జూన్ లో పార్లమెంటులో ప్రసంగిస్తూ... అమెరికా అబ్బొట్టాబాద్ లో ఆపరేషన్ నిర్వహించి ఒసామా బిన్ లాడెన్ ను చంపేసిందని, దాంతో ఆయన అమరవీరుడయ్యారని వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ నేపథ్యంలో, పాక్ సమాచార శాఖ మంత్రి ఫవాద్ చౌదరి నష్టనివారణ చర్యలకు ఉపక్రమించారు. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పొరబాటున ఆ వ్యాఖ్యలు చేశారని వివరణ ఇచ్చారు. ఒసామా బిన్ లాడెన్ ను పాకిస్థాన్ ప్రభుత్వం ఎప్పటికీ ఓ ఉగ్రవాదిగానే భావిస్తుందని, అల్ ఖైదాను ఓ ఉగ్రవాద సంస్థగానే పరిగణిస్తామని చౌదరి స్పష్టం చేశారు. అయినా, ఇమ్రాన్ వ్యాఖ్యలను మరో కోణంలో చూస్తున్నారని పేర్కొన్నారు. మీడియాలోని ఓ వర్గం దీన్ని భూతద్దంలో చూపిస్తోందని ఆరోపించారు.

అమెరికా సేనల నుంచి రక్షించుకునేందుకు ఒసామా బిన్ లాడెన్ పాకిస్థాన్ లోని అబ్బొట్టాబాద్ లో తలదాచుకోగా, అమెరికా నేవీ సీల్స్ కమాండోలు 2011లో ఓ సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించి లాడెన్ ను అంతమొందించారు. పాకిస్థాన్ గడ్డపై ఈ దాడి జరిగినప్పటికీ, ఈ ఇస్లామిక్ దేశం అగ్రరాజ్యం అమెరికాను నిందించే సాహసం చేయలేకపోయింది.

More Telugu News