సీఎం దళిత్ ఎంపవర్ మెంట్ కు రూ.1000 కోట్లు కేటాయిస్తాం: సీఎం కేసీఆర్

27-06-2021 Sun 17:10
  • ప్రగతి భవన్ లో అఖిలపక్షం
  • సీఎం దళిత్ ఎంపవర్ మెంట్ పై చర్చ
  • దళితులు అన్ని విధాలా అభివృద్ధి చెందాలన్న కేసీఆర్
  • నాలుగేళ్లలో రూ.40 వేల కోట్లు ఖర్చు చేస్తామని వెల్లడి
CM KCR talks about Dalit Empowerment

తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ హైదరాబాద్ ప్రగతి భవన్ లో అఖిలపక్ష సమావేశం జరిగింది. సీఎం దళిత్ ఎంపవర్ మెంట్ కార్యాచరణ విధివిధానాలపై ఈ సమావేశంలో చర్చించారు.

దీనిపై సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, దళితులు సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని అన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే భవిష్యత్ తరాలు నష్టపోతాయని పేర్కొన్నారు. అందుకే దళితుల అభ్యున్నతి కోసం దశలవారీగా కార్యాచరణ చేపడుతున్నట్టు వెల్లడించారు. గ్రామీణ, పట్టణ దళితుల సమస్యలను గుర్తించి పరిష్కారాలను వెతకాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. రైతుబంధు పథకం, ఆసరా పెన్షన్ల మాదిరిగా దళితుల్లో అర్హులైన కుటుంబాల గణన జరగాలని అభిప్రాయపడ్డారు.

ఈ బడ్జెట్ లో సీఎం దళిత్ ఎంపవర్ మెంట్ కు రూ.1000 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. మరో రూ.500 కోట్లు అదనంగా అందించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. నాలుగేళ్లలో రూ.40 వేల కోట్లు ఖర్చు చేయాలనేది తమ ప్రభుత్వ యోచన అని సీఎం కేసీఆర్ వివరించారు.