కేటీఆర్ ఈ జన్మకు ముఖ్యమంత్రి కాలేడు: ఎంపీ అరవింద్

27-06-2021 Sun 14:45
  • జమ్మికుంటలో అరవింద్ వ్యాఖ్యలు
  • కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందని ఎద్దేవా
  • కేటీఆర్ కోసమే ఈటలపై కుట్ర అని ఆరోపణ
  • కేటీఆర్ ను హుజూరాబాద్ బరిలో దించాలని సవాల్
BJP MP Arvind said KTR never be a CM

బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ఈ జన్మలో ముఖ్యమంత్రి కాడని స్పష్టం చేశారు. కేటీఆర్ దిక్కుమాలిన కోరిక తీర్చేందుకే ఈటలపై కుట్ర జరిగిందని అరవింద్ ఆరోపించారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం పేకమేడలా కూలిపోతుందని అన్నారు. కేసీఆర్ కు ఇప్పుడు ఓటమి భయం పట్టుకుందని వ్యాఖ్యానించారు.

హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం కేసీఆర్ రూ.300 కోట్లు ఖర్చు చేస్తున్నాడని అన్నారు. కేసీఆర్ కు దమ్ముంటే కేటీఆర్ ను హుజూరాబాద్ లో పోటీ చేయించాలని సవాల్ విసిరారు. దళితులను కేసీఆర్ లాగా మరెవ్వరూ అవమానించలేదని విమర్శించారు. భైంసా పట్టణంలో హిందువుల మనుగడే కష్టమైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో అరవింద్ ఈ వ్యాఖ్యలు చేశారు.