Shashi Tharoor: శశి థరూర్ ఖాతాను కూడా నిలిపివేసిన ట్విట్టర్

  • కొత్త ఐటీ చట్టం తీసుకువచ్చిన కేంద్రం
  • మొండిగా వ్యవహరిస్తున్న ట్విట్టర్
  • కేంద్ర ప్రముఖుల ఖాతాలపై కొరఢా ఝుళిపిస్తున్న సంస్థ 
  • రవిశంకర్ ప్రసాద్ ఖాతా నిలిపివేత
  • థరూర్ ఖాతా రెండుసార్లు నిలిపివేత
Twitter stops Shashi Tharoor account also

ఓవైపు కేంద్ర ప్రభుత్వం కొత్త ఐటీ చట్టం అమలుకు పట్టు వదలకుండా ప్రయత్నిస్తుండగా, మరోవైపు ట్విట్టర్ తానేమీ తగ్గనంటూ తన సొంత నియమావళిని వర్తింపజేస్తూ రాజకీయ ప్రముఖులకు తన తడాఖా రుచి చూపిస్తోంది. ఇవాళ కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఖాతాను ట్విట్టర్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. అలాగే, మరోపక్క, విపక్ష కాంగ్రెస్ ఎంపీ, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) శశి థరూర్ ఖాతాను కూడా ట్విట్టర్ నిలిపివేసింది. అది కూడా రెండు సార్లు. దీనిపై శశి థరూర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

తొలుత రవిశంకర్ ప్రసాద్ ఖాతాతో పాటు తన ఖాతాను కూడా నిలిపివేశారంటూ థరూర్ ఓ ట్వీట్ చేశారు. అయితే ట్విట్టర్ మరోమారు థరూర్ ఖాతాను స్తంభింపజేసింది. దీనిపై థరూర్ స్పందిస్తూ, ఇలా ఖాతాలను స్తంభింపజేసే బదులు, ఆ వీడియో కంటెంట్ డిజేబుల్ చేయొచ్చు కదా? అని హితవు పలికారు. కేంద్రం పంపిన నోటీసులకు ప్రతిస్పందనగా ఇలా ఖాతాలు నిలిపివేయడం మూర్ఖత్వమే అవుతుందని అభిప్రాయపడ్డారు. 'ట్విట్టర్ నేర్చుకోవాల్సింది చాలావుంది' అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

More Telugu News